ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల అమెరికా రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

ఇజ్రాయెల్
Spread the love

తమపై జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూ వస్తున్న ఇజ్రాయెల్.. తాను హెచ్చరించినట్టుగానే శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మెరుపుదాడి చేసింది. అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇస్ఫహాన్‌పై.. డ్రోన్లు, క్వాడ్‌ కాప్టర్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది.

తమపై జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూ వస్తున్న ఇజ్రాయెల్ (Israel).. తాను హెచ్చరించినట్టుగానే శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై (Iran) మెరుపుదాడి చేసింది. అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇస్ఫహాన్‌పై (Isfahan).. డ్రోన్లు, క్వాడ్‌ కాప్టర్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. అయితే.. ఈ దాడుల్లో పెద్దగా నష్టం జరగలేదని తెలిసింది. ఈ దాడులపై ఇరాన్ ఇంతవరకూ స్పందించలేదు కానీ, అమెరికా అధికారులు మాత్రం ఇజ్రాయెల్ చేసిన ప్రతీకార దాడి నిజమేనని తేల్చారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలో శాటిలైట్ ఇమేజ్‌లని పరిశీలించగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ శాటిలైట్ ఫోటోలు.. ఇస్ఫహాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈశాన్యంగా ‘S-300 సర్ఫేస్-ఎయిర్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు చెందిన బ్యాటరీ ఉన్నట్టు చూపుతున్నాయి. అలాగే.. ఏప్రిల్ 15వ తేదీన ఓ రహస్య ప్రాంతంలో ఉంచిన S-300 రక్షణ వ్యవస్థను (S-300 Defence System) సైతం ఆ ఫోటోలు చూపాయి. కానీ.. తాజా ‘గూగుల్ ఎర్త్ ఫోటో’ మాత్రం ఏప్రిల్ 19వ తేదీ నుంచి S-300 క్షిపణి రక్షణ వ్యవస్థ జాడ లేని ఖాళీ స్థలాన్ని చూపిస్తోంది. కాగా.. ఈ రక్షణ వ్యవస్థలో క్షిపణి లాంచర్లు, రాడార్ సహా ఇతర పరికరాలతో కూడిన అనేక వాహనాలు ఉన్నట్టు బీబీసీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రయోగించిన డ్రోన్స్, క్షిపణులు ఈ రక్షణ వ్యవస్థని తాకినట్టు బీబీసీ తెలిపింది.

అయితే.. ఇరాన్‌కు చెందిన ఇద్దరు అధికారులు మాత్రం ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. డ్రోన్లు, క్షిపణులు, విమానాలు.. ఏవీ తమ గగనతలంలోకి ప్రవేశించినట్టు ఇరాన్ సైన్యం గుర్తించలేదని పేర్కొన్నారు. అంతేకాదు.. వారి వాదనలకు ఇరాన్ రాష్ట్ర మీడియా ఏజెన్సీ IRNA కూడా మద్దతు ఇచ్చింది. ఎటువంటి దాడులు జరగలేదని, ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేయబడలేదని పేర్కొంది. కానీ.. బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ విశ్లేశించిన శాటిలైట్ చిత్రాల్లో మాత్రం ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నట్టు చూపుతున్నాయి. రక్షణ వ్యవస్థలు గుర్తించకుండా తాము దాడి చేయగలమని ఇరాన్‌కి సందేశం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ ఈ దాడి జరిపినట్టు నివేదికలు చెప్తున్నాయి.

ఇదిలావుండగా.. హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌పై ఈ నెల 13 తేదీన ఇరాన్ మూడువందలకుపైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ధ్వజమెత్తింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా దాడులు జరిపినట్లు తెలుస్తోంది. కానీ.. ఇరాన్ మాత్రం దీనిని ఖండించింది. తమ గగనతలంలో కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపించగా.. వాటిని యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ తుపాకులతో నేలకూల్చామని, ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది. మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు మాత్రం ఆ దేశ ప్రభుత్వ మీడియా ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది.

ఇజ్రాయెల్ ఎందుకు ఇస్ఫహాన్‌ను టార్గెట్ చేసింది?

ఇరాన్‌లోని మూడో అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్.. అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రం. సైనిక స్థావరాలు, పరిశోధన కేంద్రాలు, అణుకేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. అలాగే.. ఇరాన్‌ ప్రధాన వైమానిక స్థావరం కూడా ఇక్కడే ఉంది. దీనికితోడు.. ఈ ప్రాంతానికి సమీపంలోనే అణుశుద్ధి కేంద్రమున్న నతాంజ్‌ నగరం ఉంది. భారీ సంఖ్యలో డ్రోన్‌, బాలిస్టిక్‌ క్షిపణుల తయారీ కర్మాగారాలూ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఈ నగరాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.

Back To Top