తెలంగాణ బోనం అంటేనే… నాన్ స్టాప్ మ్యూజిక్..పూనకాలు లోడింగ్. ఇక.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అయితే వేరే లెవల్. ఆషాఢ మాస బోనాలకు హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఊగిపోవాల్సిందే. జూలై 7న ఆదివారం గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనంతో ఉత్సవాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజ బోనాల జాతరతో ముగుస్తాయి.
కత్తులు బల్లెం చేతబట్టీ.. దుష్టుల తలలు మాలగట్టీ.. నువ్వు పెద్దపులి.. నువ్వు పెద్దపులినెక్కి రావమ్మో గండి పేట గండి మైసమ్మా! అంటూ ఆషాఢం నుంచి శ్రావణం వరకు దాదాపు నెల రోజుల పాటు తెలంగాణలోని పట్నం, పల్లెలు మారుమోగుతాయి. ఆషాఢం అంటేనే బోనాలు.. బోనాలు అంటేనే ఆషాఢం. ఆషాఢ మాసానికి తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలకు విడదీయరాని అనుబంధం శతాబ్దాలుగా పెనవేసుకుని విరాజిల్లుతుంది. సంవత్సరమంతా వచ్చే పండగలు ఒక ఎత్తయితే, ఆషాడమాసంలో జరుపుకునే బోనాల పండుగ మరో ఎత్తు. ఆట పాటలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఊరువాడ ఎకమౌవుతుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బోనం ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా దేదీప్యమానంగా వెలుగొందుతుంది.
బోనాలంటేనే… నాన్ స్టాప్ మ్యూజిక్..పూనకాలు లోడింగ్. ఇక.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అయితే వేరే లెవల్. ఆషాఢ మాస బోనాలకు హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఊగిపోవాల్సిందే. జూలై 7న ఆదివారం గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనంతో ఉత్సవాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజ బోనాల జాతరతో ముగుస్తాయి. ఈ నెల రోజుల పాటు నగరం బోనమెత్తుతుంది. గల్లీలు, కాలనీలు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే తేడా లేకుండా అన్ని దారులు అమ్మ వైపే. అందరి కోరికా ఒక్కటే.. అందరి మొక్కూ ఒక్కటే.. మా పిల్లా పాపలను చల్లంగా చూడు తల్లీ.. మళ్లొచ్చే బోనాలకు బంగారు బోనం సమర్పిస్తా అని.
అమ్మవారికి కొత్త కుండలో కొత్త బియ్యంతో తయారుచేసిన పెరుగన్నం, బెల్లాన్ని నైవేద్యంగా తయారు చేస్తారు. దాన్ని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనంకుండలో పెట్టి డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. పోతు రాజులు విన్యాసాలు బోనాల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
గ్రామదేవతలను పూజించే విశిష్ట మహోత్సవంః
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభించే పండుగ బోనాలు. గ్రామదేవతలను తమ ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన మహోత్సవం. ఆషాఢమాసంలో జంటనగరాల్లో జరుపుకునే బోనాలు ఉత్సవాలు వేరే లెవల్. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు ప్రతిఏడు వైభవోపేతంగా బోనాలు జరపడం అనవాయితీ. ప్రతీఏటా గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు షురూ అవుతాయి. తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలు మొదలవుతాయి. లంగర్ హౌస్ నుంచి తొలి బోనాలు, బంజారా దర్వాజా నుంచి విగ్రహ పీఠము, చిన్న బజార్ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపు సాగుతుంది. కొండపై కొలువుదీరిన అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడానికి జంట నగరాల నుంచే కాకుండా కాకుండా ఇతర జిల్లాల నుంచి లక్షలాదిగా తరలొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవార్ల బోనాల అనంతరం, బల్కంపేటలో కొలువుదీరిన శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవస్థానంలో కళ్యాణోత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు షురూ అవుతాయి. రంగం కార్యక్రమం, ఏనుగు ఊరేగింపు ఉత్సవాలు ముగుస్తాయి. మలివారం లాల్ దర్వాజాలో శ్రీ సింహావాహిని మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలు మొదలవుతాయి.
కాకతీయులు, నవాబుల కాలంలోనూ బోనాలుః
18వ శతాబ్దం నుంచి అనవాయితీగా వస్తున్న బోనాల ఉత్సవాలకు చరిత్రను పరిశీలిస్తే..ఆషాఢమాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వస్తారని ప్రజల విశ్వాసం. ఆషాడమాసంలో నీటి కాలుష్యంతో వ్యాధులు, రోగాల బారిన పడకుండా తమను కాపాడాలని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రతిరూపాలైన గ్రామదేవతలు పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మలకు బోనాలు నివేదిస్తారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలంగాణలోని ప్రతీ ప్రాంతంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్ జంటనగరాల్లో 18వ శతాబ్దంలో ప్రారంభమైన బోనాల పండుగ ఆ తర్వాత తెలంగాణ అంతటా విస్తరించింది.
నిజాం నవాబుల కాలంలో.. గోల్కొండలో ప్లేగు వ్యాధికి ఎంతోమంది చనిపోయారట. స్థానికుడి కలలోకి వచ్చిన అమ్మవారు బోనాలు సమర్పించమని కోరిందని, ఆ కోరిక ప్రకారం గోల్కొండ మహంకాళికి బోనాలు సమర్పించారట. ఆ తర్వాత కాలంలో ప్లేగు వ్యాధి తగ్గ డంతో ఏటా పనిబాటలోళ్లంతా కలిసి గోల్కొండ కోటలోని మహంకాళికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారు.
కాకతీయ రాజుల కాలంలోనే గోల్కొండలో బోనాల ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారన్నది చరిత్ర సత్యం. ఆ తర్వాత కాకతీయలాధీనంలో ఉన్న గోల్కొండను స్వాధీనం చేసుకున్న కులి కుతుబ్‌షా, బాద్షాలు కూడా అమ్మవారికి బోనాల సాంప్రదాయాలను కొనసాగించారని, ప్రతి ఏడాది నెలరోజుల పాటు అధికారికంగా బోనం ఉత్సవాలు జరిపించారని చరిత్ర చెబుతోంది.
1908లో మూసీ నదికి వరద ఉప్పొంగింది… జనజీవనం అస్తవ్యస్తమైంది.. వేలాదిమంది ప్రాణాలు మూసీలో కలిసిపోయాయి. ఆ తర్వాత అంటు వ్యాధులు ప్రబలాయి… అప్పటి నిజాం రాజైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజాలో మహంకాళి అమ్మవారికి పూజలు చేసి, చార్మినార్ వద్దకు వచ్చి మూసి నదిలో సాంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలను సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అని చరిత్ర చెబుతోంది. తనిషా రాజు కొలువులో మంత్రులైన అక్కన్న మాదన్నలు శాలిబండలోని హరిబౌలి అమ్మవారి ఆలయం నుంచి గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలు జరిపించారని చరిత్ర చెబుతోంది.
పోతురాజు చరిత్రః
ఆషాడమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ప్రతి ఇంట అమ్మవారికి కొత్త కుండలో కొత్త బియ్యంతో బెల్లన్నం వండి, బోనంకుండను పసుపు కుంకుమ, వేపాకులతో అందంగా అలంకరించి నెత్తిన ఎత్తుకుని డప్పు దరువుల మధ్య ఆలయానికి వెళ్లి.. అమ్మవారికి నైవేధ్యంగా సమర్పించారు. బోనాల ఉత్సవాల్లో ఓవైపు శివసత్తుల పూనకాలు, మరోవైపు పోతురాజుల విన్యాసాలు సెంటరాఫ్ ఎట్రాక్షన్. పురాణాల ప్రకారం ఏడుగురి అక్కాచెల్లెళ్లు అయిన అమ్మవార్ల తమ్ముడే ఈ పోతురాజు. డప్పుల దరుపులు, మేళతాళాలతో, కొరడాతో విన్యాసాలు చేస్తూ బోనాల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు కనిపిస్తారు.
పోతురాజు వేషం వేసే వారు రోజంతా ఉపవాసం పాటిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి అనంతరం అలంకరించుకుంటారు. దాదాపు కేజీ పసుపుకు అర కిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు. ఒకప్పుడు కేవలం పసుపు పూత, పెద్ద కుంకుమ బొట్టుకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు రకరకాల రంగులకు, రకరకాల ఆకృతులకు మారింది. పోతురాజు అలంకరణ తర్వాత వారి మొహంలో వారికే తెలియని గంభీరత ఉట్టిపడుతుంది.
అమ్మ రూపమే అట్రాక్షన్
తెలంగాణ గ్రామాల్లో మహంకాళి గుళ్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. విరబోసుకున్న జుట్టు, నిప్పుకణికల్లాంటి ఎర్రని కండ్లు, బయటకు చాచిన పొడవాటి నాలుకతో.. ఉగ్రరూపంలోని మహంకాళి ఆకారాన్ని తెలంగాణ గ్రామాల్లో ‘మైసమ్మ’ అని పిలుస్తారు. ఆ తల్లికి ఎన్నో పేర్లు. ఆమె రూపాన్ని బట్టి రకరకాలుగా కొలుస్తారు. కోటకు కావలిగా ఉండే దేవతను ‘కోట మైసమ్మ’ గా, దొరల గడికి కాపలా ఉండే తల్లిని ‘గడి మైసమ్మ’. కట్టకు పడిన గండిని పూడ్చిన చోట వెలిసే అమ్మవారిని ‘గండి మైసమ్మ’. చెరువు కట్టను రక్షించే మహంకాళిని ‘కట్ట మైసమ్మ’గా భావించి భక్తులు పూజలు జరిపిస్తారు.
మైసమ్మకు నల్ల పోచమ్మ, తెల్ల పోచమ్మ, ముత్యా లమ్మ, డొక్కలమ్మ, మారెమ్మ, ఉప్పలమ్మ తోబుట్టువులని ప్రగాఢంగా విశ్వాసిస్తారు. ఈ ఏడుగురు అక్క చెల్లెళ్లదీ ఉగ్రరూపమే. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఉగ్రత్వం ప్రదర్శిస్తారు. ఒంటిమీద నల్లని పొలుసులు సృష్టించే మహమ్మారిని నల్ల పోచమ్మ అంటారు. తెల్లని పొలుసులు వస్తే అది తెల్ల పోచమ్మ. దేహంపై బొబ్బల మాదిరిగా కురుపులు ఏర్పడితే అది ముత్యాలమ్మ. రోగగ్రస్తమైన తర్వాత శరీరం బక్కచిక్కి డొక్కలు తేలేట్టు అయితే.. డొక్కలమ్మ.
ఉగ్రంగా ఉన్న ప్రకృతి దేవతను చల్లబరిచేందుకు అంటే సల్లంగ చూడమని కోరేందుకు జరిపేదే బోనాల పండగ. కరువుకాటకాలు, వరదలు, అంటు వ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా ఆ ప్రకృతి దేవత ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బోనమెత్తినట్టే.. కరువుకాటకాలు, అంటురోగాలు ప్రబలకుండా చూడమని ప్రతి ఆషాఢంలో ఊరూ వాడా బోనాల జాతరై కదులుతుంది. అమ్మవారికి సాకపోసే కల్లు, ఉల్లిగడ్డ, చింతపండు రసం, బోనాలు సమర్పించగా అమ్మవారి వద్ద కుప్పగా పోసిన అన్నంపై వేడి నెత్తురు చల్లితే అమ్మవారు శాంతిస్తుందని భక్తుల నమ్మకం. కరువు, వరదల నుంచి కాపాడి, అంటురోగాల బారినపడకుండా కాపాడుతుందని విశ్వాసం.
ఆషాఢం తొలకరి పండుగ
పల్లె పర్యావరణంలో తొలకరి చినుకులు ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. నేల పదునుగా ఉంటుంది. రైతు దుక్కి దున్నుతాడు. బంగారు పంటలు పండాలని కోరుకుంటాడు. పంటలు బాగా పండాలని రైతు ప్రకృతి దేవతను ఆరాధిస్తాడు. తొలకరి వానకు తొలిసాలు దున్నడంతో సేద్యం పని మొదలవుతుంది. తొలకరి సాగుతోనే అన్ని కులాల వారికీ పని దొరుకుతుంది. వడ్రంగి బండి, నాగలి వంటి వ్యవసాయ సామగ్రిని, కమ్మరి కర్రు, కొడవలి, పార, గడ్డపార వంటి పనిముట్లు సిద్ధం చేస్తాడు. పంట పండితేనే కూలీలకు చేతినిండా పని.
ఊరందరికీ చెరువే ఆదరువు. చెరువు నిండితే ముత్రాసి వాళ్లకు చేపల వేటకు ఉపాధి. ఊరి మురికినంతా వదిలించే చాకలికి, కుండలు చేసే కుమ్మరికి కూడా చెరువు నీళ్లే ఆధారం. అందుకే చెరువును నింపి సల్లంగ చూడమని కోరేందుకు ఊరంతా ఊరిపోషమ్మ దగ్గరికి కదిలివ స్తుంది. బోనాల జాతర ఊరి నిర్మాణాన్ని బట్టి జరుగుతుంది. ఊళ్లో ఎన్ని కులాలు ఉంటే, అన్ని కులాల వారు బోనాల పండగలో భాగం పంచుకుంటారు. తెలంగాణ బోనాలు మొదలయ్యే గోల్కొండ కోటలో బోనం మున్నూరుకాపు కులానికి చెందిన పటేలమ్మ ఇంటినుంచి తొలిబోనం వస్తుంది. అమ్మవారి జాతరలో బైండ్లవాళ్లు డప్పులు కొడుతూ వస్తారు. చాకలి బలి ఇస్తారు.
ఉజ్జయినీ నుంచి మహంకాళీః
సికింద్రాబాద్ స్థానికుడైన సురిటి అప్పయ్య బ్రిటిష్ సైన్యంలో డోలీగా పనిచేస్తూ ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. అక్కడ 1813లో కలరా మహమ్మారి విజృంభించడంతో ఎంతోమంది చనిపోయారు. ఆ మహమ్మారి నుంచి కాపాడితే సికింద్రాబాద్‌లోని మహంకాళికి విగ్రహం చేయిస్తానని మొక్కుకున్నాడట అప్పయ్య. కలరా తగ్గిపోయాక క్షేమంగా నగరానికి వచ్చిన ఆయన.. జూలై 1815లో ఉజ్జయిని మహంకాళికి కొయ్య విగ్రహం చేయించాడు.
అమ్మవారి విగ్రహాన్ని ఓ వేప చెట్టు కింద ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడో చిన్న ఆలయం వెలిసింది. ఆ తర్వాత ఆలయ విస్తీర్ణం పెంచే క్రమంలో తూర్పు వైపున్న బావిని మరమ్మత్తు చేయిస్తుండగా అందులో మాణిక్యాంబ విగ్రహం లభించింది. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఇక్కడ కొలువైన అమ్మవారి చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తుంది. ముందున్న వేప చెట్టుని అలాగే వుంచి చుట్టూ ఆలయం నిర్మించారు.
వారసత్వ బాధ్యతః
వందల ఏండ్ల నుంచీ బోనాలు జరుపుకొంటున్న గుళ్ళలో కుండ, బోనం, పోతరాజు, ఘటం అలంకరించడం వంటివన్నీ ఒకే కుటుంబం నుంచి వారసత్వంగా చేపడుతున్నారు. వాస్తవానికి ఇది గ్రామ నిర్మాణంలో భాగమైన ఆయా కులాలవారికి లభించే ప్రాతినిధ్యం. కొన్ని గ్రామాలలో కొన్ని కులాలు మాత్రమే ఉంటాయి. ఆ ఊళ్ల నిర్మాణాన్ని బట్టి బోనాల జాతర నిర్వహణలో తేడాలు కనిపిస్తాయి. పోతరాజులు, పూజారులు, తొలి బోనం సమర్పణకు బాధ్యత వహించే కులాల్లో ఈ తేడాలు చూడొచ్చు. పర్యావరణాన్నే దేవతగా కొలిచే బోనాల జాతరలో ఆ ఊరి నిర్మాణంలో ఉన్న కులాలన్నీ నియమానుసారంగా భాగస్వామ్యం అవుతాయి. ఆలయాల్లో జరుపుకొనే బోనాల పండుగలోనూ ఇలాంటి నియమం కనిపిస్తుంది.
అలలు అలలుగా జాతరః
బోనాల పండుగను ఒక ఆలయం తర్వాత మరో ఆలయంలో నిర్వహించడంలోనూ ఒక క్రమం కనపడుతుంది. ప్రతి క్షేత్రంలో ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉంటారు. గోల్కొండ బోనాలు జరిగిన రోజున గోల్కొండ ప్రాంతంలోని ఆ ఏడుగురు అక్కచెల్లెళ్లకూ బోనాలు ఇస్తారు. గోల్కొండ.. చుట్టూ ఉన్న కార్వాన్, ధూల్‌పేట, పత్తరఘట్టి, రాయదుర్గం వరకు గోల్కొండ బోనాలు జరుపుకొంటారు. గోల్కొండ మహంకాళి అమ్మవారి బోనాల కోసం ఉజ్జయిని మహంకాళి ఎదురు చూస్తుంది. గోల్కొండలో బోనాలు జరిగిన తర్వాత వచ్చే ఆదివారం రోజున లష్కర్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు పండుగ చేసుకుంటారు. అదే రోజున లష్కర్లో ఉన్న ఏడుగురు అక్కచెల్లెళ్ల ఆలయాలన్నిటిలో బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, మౌలాలి, ఈసీఐఎల్ సమీప ప్రాంతాల వరకు లష్కర్ బోనాలు జరుపుకొంటారు. తొట్టెల ఊరేగింపు చేస్తారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కోసం లాల్ దర్వాజ బోనాలు ఎదురుచూస్తాయి. లాల్ దర్వాజ బోనాలు జరుపుకొనే రోజే పాతబస్తీ లోని ఏడుగురు అక్కచెల్లెళ్లకు బోనాలు సమర్పిస్తారు. శివసత్తుల పూనకాలు, కోడెనాగులాంటి కొరడా చేబూని, వీర గోలలు మోగించుకుంటూ, కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని మోగిస్తూ వీరంగాలు ఆడే పోతరాజుల విన్యాసాలతో పాతబస్తీ వీధులు జనసంద్రమవుతాయి. బోనాలెత్తిన మహిళలతో వీధులన్నీ ఆలయాల వైపునకు ప్రవహిస్తున్నాయా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది పాతబస్తీ.
ఒక గుడిలో జరిగిన తర్వాతనే మరో గుడిలో బోనాల పండుగ జరుపుకోవాలనే ఆచారం వల్లే ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు బోనాలు జరుగుతాయి. నీటిలో ఒక బొట్టు పడిన చోటు నుంచి పుట్టిన అలలు వ్యాపిస్తూ వ్యాపిస్తూ పోయినట్లుగా గోల్కొండ కోటలో మొదలైన ఆషాఢ జాతరను శ్రావణం వరకు స్థానికులు దశలు దశలుగా జరుపుకొంటారు. మొక్కులు ఉన్నవారు సాధారణ రోజుల్లోనూ బోనాలు సమర్పిస్తారు. పెళ్లయితే ఆడ పిల్ల పుట్టింటివాళ్లు నవ వధువుతో బోనం సమర్పిస్తారు. వ్యాపారంలో కలిసి రావడం, రోగాల నుంచి స్వస్థత లభించడం.. తదితర సందర్భాల్లోనూ బోనాలు సమర్పిస్తారు. ఏడాది పొడవునా సాగే ఈ బోనాలు ఆదివారం, మంగళవారం రోజుల్లో నివేదిస్తారు. ఇవే కాకుండా పంటను, ఇంటిని కాపుగాసే దేవతకు పొలంలో, పెరటిలో చిన్న గుడి కట్టి ఏడాదికోసారి బోనం సమర్పించే ఆనవాయితీ కూడా ఉన్నది.
ప్రతీఏటా కొత్తదనమేః
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవడంతో దశాబ్ది బోనాల ఉత్సవాలపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయం మొదలు, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, పాతబస్తీ లాల్ దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం, మీర్ ఆలం మండిలోని శ్రీ మహాకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయం, శాలిబండలోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, చార్మినార్ లోని శ్రీ భాగ్యలక్ష్మీ దేవాలయం, కార్వాన్‌లోని శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, సబ్జీమండిలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయం, మొత్తం 9 దేవాలయాలకు మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మిగతా 19 దేవాలయాల్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
ఒకప్పుడు గ్రామంగా ఉన్న హైదరాబాద్ కాలక్రమంగా పట్టణంగా ఆ తర్వాత నగరంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు విశ్వనగరంగా తయారైంది. అయినా ఇక్కడ ప్రజలకు గ్రామ దేవతలపై విశ్వాసం చెరగలేదు, బోనాల కళ ఏమాత్రం తగ్గలేదు. జంట నగరాలు రూపురేఖలు మార్చుకుని, పచ్చదనాన్ని కోల్పోయాయి. అనాదిగా వస్తున్న కొన్ని పండుగలు ఉనికిని కోల్పోయాయి. మరికొన్ని పండగలు కొత్తగా పుట్టుకొచ్చాయి. నగరాలు ఎంతగా మారినా భక్తిశ్రద్ధలతో నగరవాసులు చేసుకుంటున్న బోనాల పండుగ ప్రతీఏటా కొత్తదనమే.