కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు(ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గీత కార్మికులతో సీఎం ఈరోజు (ఆదివారం) ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్‌గూడ తాటివనంలో సీఎం ఈత మొక్క నాటారు.
రంగారెడ్డి జిల్లాలో కీలక ప్రాజెక్టులు..
రోడ్ల పక్కన తాటిచెట్లు నాటాలనే నిబంధన విధిస్తామని చెప్పారు. గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి ప్రతీకలని కొనియాడారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్నో కీలక ప్రాజెక్టులు తేవటంలో దేవేందర్‌గౌడ్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య, వైద్యం.. అందించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు. పేదల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చామని ఉద్ఘాటించారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
తాటి, ఈత చెట్లు పెంచుతాం..
ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచుతామని అన్నారు. ప్రాజెక్టుల దగ్గర, కాలువల పక్కన తాటి, ఈత వనాలు పెంపకం చేపట్టినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిందన్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్, ORRతో రంగారెడ్డి జిల్లాలో భూములకు విలువ పెరింగిందని చెప్పారు. హయత్ నగర్ వరకు త్వరలోనే మెట్రో రైలు విస్తరిస్తున్నట్లు తెలిపారు. హయత్‌నగర్‌లో మెట్రో ఎక్కితే నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రూ.8లక్షల కోట్ల అప్పులు
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలు చూసి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముందుకు వస్తున్నారని చెప్పారు. అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని, మంచిచేసే ప్రభుత్వానికి అండగా ఉండటానికి తమతో చేయి కలుపుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారికి తగిన బుద్ధి చెబుతున్నారని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులకు నెలకు రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారుపేరు
‘‘ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని గౌడన్నలు ఎంతో ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బలహీనవర్గాల గౌరవం పెరుగుతుందని గౌడన్నలు ప్రచారం చేశారు. పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలు. కులవృత్తులకు చేయూత అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎవరెస్టు ఎక్కిన వారి అనుభవం గౌడన్నల రక్షణకు ఉపయోగపడింది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తోంది. వైఎస్సార్ హయాంలో బలహీన వర్గాల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. రాష్ట్రంలో వనమహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకి సూచిస్తున్నా . చెరువు గట్లపై కూడా చెట్లు నాటలా ఇరిగేషన్ విభాగంతో మాట్లాడాలి’’ అని మంత్రి శ్రీధర్ బాబుకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి..
‘‘రహదారులు, చెరువుగట్లు, కాలువగట్ల వద్ద తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటాం. గౌడన్నల కులవృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కులవృత్తులపై ఆధారపడిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించండి.. వాళ్లను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలి. చట్టాలు రూపొందించే స్థాయికి మీ పిల్లలు ఎదగాలి. బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే ఏకైక మార్గం చదువు మాత్రమే. త్వరలోనే హయత్ నగర్‌కు మెట్రో రాబోతుంది. ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలను, మెడికల్ టూరిజం, పరిశ్రమల ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్, గంజాయి
‘‘న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అణువుగా మార్చబోతున్నాం. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోంది. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దుతాం. ఓడిపోయి ఫామ్ హౌస్‌లో ఉన్నోళ్లను నేను అడుగుతున్నా. ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా? మీరేం తెచ్చారు… డ్రగ్స్, గంజాయి తప్ప. కాంగ్రెస్ పని అయిపోయింది అన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకునే పరిస్థితి. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆరెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. మీరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. ప్రభుత్వాన్ని నిలబెట్టాలని వాళ్లు మద్దతుగా వస్తున్నారు. పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. గత బీఆరెస్ పాలకులు తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు. మేం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం’’ అని ముఖ్మమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.