ఐపీఎల్ 2024లో తొలి విజయం సాధించిన జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన రిషబ్ పంత్‌కు భారీగా జరిమానా పడింది. విశాఖపట్నం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ పాలక మండలి పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
ఐపీఎల్ 2024లో(IPL 2024) తొలి విజయం సాధించిన జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు (Delhi Capitals) షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant) భారీగా జరిమానా పడింది. విశాఖపట్నం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో(Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ పాలక మండలి పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించడం జరిగింది.’’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కాగా స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న రెండో కెప్టెన్ రిషబ్ పంత్ నిలిచాడు. ఇంతకుముందు చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై కూడా రూ.12 లక్షల జరిమానా పడింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నైసూపర్ కింగ్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(51), ఓపెనర్ డేవిడ్ వార్నర్(52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పృథ్వీ షా(43) కూడా రాణించాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో చెన్నై చతికిలపడింది. మొత్తం ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. చివర్లో ధోని మెరుపులు మెరిపించిన ఫలితం లేకపోయింది. చెన్నై జట్టులో రహానే(45), డారిల్ మిచెల్(34), ధోని(37) రాణించారు.