వేసవిలో షురువైన ఆవకాయ పచ్చళ్ల సీజన్‌..

ఆవకాయ
Spread the love

మామిడి తొక్కుల్లో ఈ వెరైటీలు ట్రై చేశారా? మండే ఎండలతోనే మామిడి సీజన్‌ వస్తుంది ఆవకాయ పచ్చళ్ల సీజన్‌… తినేందుకు రసాలు.. పచ్చడి పెట్టుకునేందుకు కాయలు పక్వానికి వచ్చే సమయం. నిల్వ పచ్చడి పెట్టుకునేవారు తోటలు, మార్కెట్‌ల చుట్టూ తిరిగి మంచి కాయలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

మండే ఎండలతోనే మామిడి సీజన్‌ వస్తుంది. తినేందుకు రసాలు.. పచ్చడి పెట్టుకునేందుకు కాయలు పక్వానికి వచ్చే సమయం. నిల్వ పచ్చడి పెట్టుకునేవారు తోటలు, మార్కెట్‌ల చుట్టూ తిరిగి మంచి కాయలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. తమ ఇంటి అవసరాలతోపాటు పచ్చళ్లు పెట్టి విక్రయించేవారికీ ఇది సమయమే. ఆహా ఏమి రుచి.. తినరా మైమరిచి.. అని నోరూరించే విధంగా పచ్చళ్లు తయారీ చేసే పనిలో లీనమయ్యారు. ఏప్రిల్‌, మే నెల వచ్చిందంటే మామిడికాయలు పక్వానికి రావడంతో పప్పుతోపాటు ముక్కలను పచ్చడి పెట్టుకుని ఆ రుచిని ఆస్వాదిస్తుంటారు. ఏడాదికి సరిపడా పచ్చడి తయారు చేసి నిల్వ పెట్టుకుంటారు. ఇంట్లో కూర లేకపోయినా భోజనంలో మామిడికాయ కారం వేసుకుని రుచిగా లాగించేస్తారు.

పచ్చడిలో నెయ్యి లేదా మీగడ కలుపుకుని తింటే ఆ రుచి వర్ణనకందని విధంగా ఉంటుంది. తెలుగు రాష్ర్టాల్లో మామిడి కాయ పచ్చళ్లను వివిధ రకాలుగా పెట్టుకుంటారు. చిన్న రసాలు, గులాబీలు, మల్లిక, తోతాపురి, నాటు మామిడి కాయలతో పచ్చడి పెట్టుకుంటారు. చిన్న రసాల కాయలు మంచి పీచుతో ఉండి.. కారం కూడా ఎక్కువ కాలం మన్నడంతోపాటు రుచిగా ఉంటుంది. ముక్కలు గట్టిగా ఉండి పీచుకు కారం, ఉప్పు పట్టి టేస్టీగా ఉంటుంది.

కాయ ఒక్కటే.. రకాలు అనేకం..

మామిడి కాయలతో అనేక రకాల పచ్చళ్లు పెట్టుకోవచ్చు. తినాలనే కోరిక ఉండాలే కానీ రోజుకో రకం పచ్చడిని తినేయవచ్చు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమయంలో 100 నుంచి 200 మామిడికాయలతో వివిధ రకాల పచ్చళ్లు పెట్టుకునేవారు. దీంతో ఉమ్మడి కుటుంబానికి అది సరిపోయేది. ఒక కుటుంబంలో 10 నుంచి 12 మంది ఉంటారు. వీరందరికీ.. ఎవరి ఇష్టానికి తగినట్లుగా వారికి ఆయా రకాల పచ్చళ్లను సిద్ధం చేసేవారు. ఎల్లిపాయ పచ్చడి.. ఆవకాయ పచ్చడి, మెంతికాయ, ముక్కల పచ్చడి, జీడి ఆవ, నువ్వు ఆవ వంటి రకాలను పెట్టుకుంటారు. ఇవన్నీ మామిడి కాయలతోనే చేసినా ఒక్కొక్కటి ఒక్కో రుచితో తిన్నా కొద్ద్దీ తినాలనిపించేలా ఉంటాయి. ఎల్లిపాయ కారం..

ఎల్లిపాయతో మామిడి కాయ

పచ్చడి పెట్టాలంటే 25 కాయలకు మూడు డబ్బాల కారం, ఒక డబ్బా ఎల్లిపాయలు, మూడు డబ్బాల ఉప్పు, పసుపు, కేజీ నువ్వుల నూనె, కొన్ని మెంతులు అవసరం అవుతాయి. ముందుగా కారం, పసుపు, ఉప్పు కలుపుకోవాలి. అందులో నూనె పోసి, మెంతులు వేయాలి. ఇందులో మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు కొంత కచ్చాపచ్చాగా దంచి వేయాలి. మొత్తం ఒకసారి కలపాలి. దీంతో ఎల్లిపాయ కారం రెడీ అయినట్లే.

ఆవకాయ
ఆవకాయ

ఆవకాయ పచ్చడి..

ఆవకాయ పచ్చడికి 25 మామిడి కాయలకు మూడు డబ్బాల కారం, మూడు డబ్బాల ఆవ పిండి, మూడు డబ్బాల ఉప్పు, కేజీ నూనె, మెంతులు, పసుపు కావాలి. కారం, ఆవపిండి, పసుపు, ఉప్పు కలిపి.. అందులో నూనె పోయాలి. ఈ మొత్తంలో మామిడి ముక్కలు పోసుకుంటూ కలపాలి. మొత్తం సిద్ధమయ్యాక ఒక జాడిలో పెట్టుకోవాలి. ఆవకాయ పచ్చడి మంచి రుచిగా ఉండి.. మళ్లీ మళ్లీ తినాలనిస్తుంది.

మెంతికాయ పచ్చడి..

మెంతికాయ పచ్చడి రుచిగా ఉంటుంది. దీనికి కూడా 25 మామిడి కాయలకు మూడు డబ్బాల కారం, రెండు డబ్బాల మెంతి పిండి, మూడు డబ్బాల ఉప్పు, కేజీ నూనె, పసుపు ఉంటుంది. కారం, మెంతిపిండి, ఉప్పు, పసుపు కలిపి.. అందులో నూనె పోసుకోవాలి. ఆ మొత్తంలో మామిడి ముక్కలను కలిపేస్తే మెంతికాయ పచ్చడి అయినట్లే. ఈ మూడు కూడా దేనికి అదే డిఫరెంట్‌ రుచితో ఉంటాయి.

జీడి ఆవ..

జీడి ఆవ పచ్చడి తింటుంటే ఘాటుని ఇస్తుంది. ఇందుకు 25 మామిడి కాయలను కోసుకుని.. కాయల మధ్యలో ఉండే జీడిని పక్కన పెట్టుకోవాలి. మూడు డబ్బాల కారం, మూడు డబ్బాల ఉప్పు, సరిపడా పసుపు, ఒక కేజీ నూనె అవసరం ఉంటుంది. కాయల మధ్యలో ఉన్న జీడిని మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంత నీటిని పోసి.. ఒక గిన్నెలో దానిని ఒడబోయాలి. కారం, ఉప్పు, పసుపు కలుపుకోవాలి. అందులో నూనెతోపాటు.. జీడి ఉన్న నీటిని కలిపేయాలి. అందులో మామిడికాయలు కలుపుకుంటే జీడి ఆవ సిద్ధమైనట్లే.

నువ్వు ఆవ..

నువ్వుల ఆవకాయ కూడా రుచిగా ఉంటుంది. పచ్చడి తయారీకి 25 మామిడికాయలకు.. మూడు డబ్బాల కారం, మూడు డబ్బాల ఉప్పు, పసుపుతోపాటు పావు కేజీ నువ్వుల పొడి తీసుకోవాలి. అలాగే కేజీ నూనె సిద్ధంగా ఉంచుకోవాలి. వీటిలో కారం, ఉప్పు, పసుపుతోపాటు నువ్వుల పొడిని కలుపుకోవాలి. అందులో మామి డికాయ ముక్కలను కలిపి.. నూనె పోసుకోవాలి. దీంతో నువ్వు ఆవ సిద్ధమైనట్టే..

Back To Top