పాలకులు మారినా ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రభుత్వ విద్యాలయాలు

విద్యాలయాలు
Spread the love

ప్రభుత్వ బడులు పలుచనతోనే, ప్రైవేటు బడులు గెలిచేనా?

ఒకేదేశం-ఒకే రకమైన విద్యాలయాలు ఉంటే మార్పులు స్పష్టం.

తల్లిదండ్రుల ఆలోచనల్లో ఉచితం ఉదాసీనతను పెంచించింది.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉండేవంట అని చెప్పే పరిస్థితి ఎంతో దూరంలో లేదేమో!

హైదరాబాద్(చైతన్యగలం): కర్ణుని చావుకు కారణాలెన్నో అన్నట్లు ప్రభుత్వ విద్య పేదవాడికి రోజురోజుకూ దూరమవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి.పాలకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం ఇలా ఎవరికి వారు తమ తమ పాత్రలను పోషిస్తూ మొత్తానికి ప్రభుత్వ విద్యను పతనావస్థకు తీసుకొచ్చారనేది అందరం అంగీకరించాల్సిన కఠిన వాస్తవం.

ఇప్పుడున్న ఉద్యోగులు ,ప్రజాప్రతినిధులు సింహభాగం ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే. అప్పట్లో ఇప్పుడు ఉన్నన్ని పాఠశాలలు కానీ సౌకర్యాలు కానీ లేవు. అయిన కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి అరకొర వసతులతో చదువుకొని ఇంట్లో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ చదువు విలువ, గురువు విలువ తెలుసు కాబట్టి నిష్ఠతో చదువుకున్నారు. బడులను కాపాడుకొని వాటి స్థాయిని పెంచారు .

గ్రామములోని అన్నిరకాల వర్గాల ప్రజలు వారి పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడం వలన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామంలోని పెద్దమనుషులు బడులను బలోపేతం చేయడంలో తమవంతు సహకారం అందించేవారు. మరి నేడు 90శాతం వెనుకబడిన వర్గాల పిల్లలే చదువుతున్నారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పనులు వచ్చినప్పుడు బడికి వస్తున్నారు తప్ప ప్రభుత్వ విద్య బలోపేతానికి ముందుకురావడం లేదు. ఇలా ప్రభుత్వ బడులు నిర్వీర్యం కావడానికి సమాజం ఒక కారణంగా చెప్పవచ్చు.


ప్రైవేట్ పాఠశాలలు ఒక కారణంగా చెబుతున్నప్పటికీ వాటికి అడ్డదారుల్లో అనుమతిస్తూ విద్యను వ్యాపారం చేసిన ప్రభుత్వాలది బాధ్యతా రాహిత్యం కాదా? ఒక ప్రైవేట్ పాఠశాలకు అనుమతి ఇవ్వాలంటే పాటించాల్సిన నిబంధనలు స్థలం ,అక్కడ బోధించే ఉపాధ్యాయుల అర్హతలు ఇవేవీ చూడకుండా గ్రామనికో పాఠశాలకు అనుమతులు ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల మూతబడే పరిస్థితికి కారణం ఉపాధ్యాయులు అన్నట్లు సమాజానికి చూపే ప్రయత్నం ప్రభుత్వం చేయడం బట్ట కాల్చి మీద వెయ్యడంలాంటిది కాదా?


ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల్లో యాజమాన్యాలవారికి నచ్చిన పుస్తకాలను బోధించే హక్కు ఎక్కడి నుండి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో భోధిస్తున్న కరికులం వేరు , మరి ఒకే తరగతి చదువుతున్న సమవయస్కులైన పిల్లలు ప్రభుత్వ విద్యార్థి ఒక కరికులం ప్రైవేట్ విద్యార్థి మరో కరికులం చదివితే ఏ రెండు పాఠశాలల విద్యార్థుల్లో సమాన స్ధాయి ప్రమాణాలు ఎలా ఉంటాయి.

అందుకే విద్యా సంవత్సరం ప్రారంభం అయిందంటే చాలు కప్పగంతుల్లా ఆ బడి నుండి ఈ బడికి , ఈ బడి నుండి మరో బడికి పిల్లలు మారాల్సి వస్తుందనేది సమాజం,పాలకులు గమనించడం లేదా 6వ తరగతి నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బడులలో ఒకే కరికులం భోధిస్తున్నపుడు ప్రాధమిక స్థాయిలో కూడా అందరికీ ఒకే కరికులం ఉండకపోవడం పక్కా వ్యాపారం కాదా?

విద్యాలయాలు
విద్యాలయాలు


ప్రైవేట్ బడిలో అర్హతలేని (కొన్ని చోట్ల కేవలం ssc) ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులు చేరడానికి ప్రధాన కారణం తరగతికో ఉపాధ్యాయుడు ఉండటం మరియు సులభమైన, సరళమైన, ఆకర్షణీయమైన పుస్తకాలు.
వీటన్నిటినీ శాస్త్రీయ సమతూకం కల్పిచడంలో ప్రభుత్వాలు విఫలమవ్వడం ఒక కారణంగా చెప్పవచ్చు.

★ ఉపాధ్యాయుల విషయానికొస్తే కొందరు ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులు లేరనే నెపంతో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి సొంతపనులు, వ్యాపారాల్లో చూపిస్తున్నంత శ్రద్ధ విద్యార్థులకు భోధించడంలో చూపించకపోవడం చేత విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడం వారికి కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు వత్తాసు పలకడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నిబద్ధతతో పనిచేస్తూ ఉన్న విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దిన వారికేమో సరైన గుర్తింపు లేకపోగా మరుసటి సంవత్సరం వారిని ప్రైవేటుకు, గురుకులలకు పంపుతున్న తల్లిదండ్రులు ఒకవైపు.

★ప్రభుత్వాలేమో కులానికో గురుకులం పేరుతో ఇబ్బడిముబ్బడిగా గురుకులాలను ఏర్పాటు చేసి 20మార్కులు వచ్చిన పిల్లలను సైతం చేర్చుకోవడం తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం నుండి నాణ్యమైన విద్యను ఆశించడం మానేసి గుడ్డు, ఫుడ్డు, చికెన్,అంటూ ప్రభుత్వాలు చెప్పే వాటికి దాసోహమై పోవడం చేత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కరికులం గురించి కానీ , ఆంగ్ల మీడియం బోధన వాస్తవ పరిస్థితులను గురించి కానీ ప్రశ్నించకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు.

★కేంద్రప్రభుత్వం వారు అపుడపుడు దేశమంతటా విద్యార్థుల్లో గల విద్యా ప్రమాణాలు తెలుసుకోవడం కోసం నిర్వహించే NAS (National achievement survey) పరీక్ష పేపర్ ను విద్యావేత్తలు ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది మన కరికులంలోని లోపమేమిటనేది. ఇలా మొదట చెప్పినట్లు కర్ణుని చావుకు కారణాలు కొన్నేమో కానీ మన ప్రభుత్వ బడులు కనురుగయ్యే పరిస్థితులు రావడానికి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కారణాలు.

★నేటి తల్లిదండ్రులు 90శాతం కనీసం 10వ తరగతి చదివినవారు ఉన్నప్పటికీ తమ పిల్లలకు కనీసం ఇంటిదగ్గర గంటసమయం వెచ్చించలేని పరిస్థితుల్లో ఉండటం వలన ఎపుడెపుడు బడికి పంపిద్దామా అనే ఆలోచన ధోరణితో 3 ఏళ్లకే ప్రైవేటు బస్సులు ఎక్కించి 7గంటలకే పంపించేయడం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నవారు కొందరైతే మరికొందరేమో అరకొర వసతులున్నా సరే ఎపుడెపుడు హాస్టళ్లలో వేసి బాధ్యతలు దులుపుకుందామా అని బావిస్తున్నారు తప్ప అక్కడకు పంపించడం నిజంగా అవసరమా? పోనీ పంపించాక అక్కడ నాణ్యమైన విద్య, ఆహారం అందుతుందా? అని ఆలోచించడం లేదు. ఒకప్పుడు పిల్లలను హాస్టళ్లలో వేసే తల్లిదండ్రులను బీదవారిగా గుర్తించిన సమాజం నేడు దానిని స్టేటస్ సింబల్ గా చూడటం కూడా కారణంగా చెప్పవచ్చు.

జి. రామకృష్ణా రెడ్డి సీనియర్ జర్నలిస్ట్
జి. రామకృష్ణా రెడ్డి

సీనియర్ జర్నలిస్ట్
Back To Top