రేపటి భారతం ఏమవుతుందో?

లక్ష్యాలు
Spread the love

నాడు సిద్ధాంత రాజకీయాలలైతే నేడు ఆధునిక అశుద్ధ రాజకీయాలు – నాడు సేవ కోసం రాజకీయాలు నేడు వ్యక్తిగత తోవ కోసం రాజకీయాలు ఇదే నేటి భారతం.

విలువల వలువలు విప్పుతున్న నేటి రాజకీయాలు

సేవా రాజకీయాలు కావివి స్వాహా రాజకీయాలు

ప్రజాస్వామ్యమా లేక స్వప్రజాస్వామ్యమా

ఆధునిక అధర్మ రాజకీయాలు

రాజకీయం అంటే సేవచేయడం అని ఒకప్పుడు నాయకులు మరియు ప్రజలు విశ్వసించేవారు. నాయకులు కూడా ప్రజలకు సేవచేయడం కోసం మాత్రమే రాజకీయాలలోకి వచ్చేవారు. ప్రజలకు సేవచేయడం కోసం తమ కుటుంబాలకు దూరమైన నాయకులు కొందరైతే యావదాస్తులను ప్రజలకోసం రాసిచ్చినవారు కొందరు. ఇంకొందరు పెళ్లి, పిల్లలు వద్దనుకొని సమాజమే తన కుటుంభం అనుకునేవారు, మరికొందరు అత్యున్నత పదవులను అనుభవించి కూడా పూరి గుడిసెలలోనే చివరివరకు జీవించి చిరకాలం ప్రజల గుండెల్లో జీవించారు. ఇదంతా ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య,లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం, వాజ్ పేయి, అంజయ్య ,మరియు గుమ్మడి నర్సయ్య లాంటి వారు ఉదహరణలుగా చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా గత చరిత్ర.


మన భారతదేశ చరిత్రలో చాణక్యుని రాజనీతి మరియు భారతంలో తండ్రికి వివాహం చేయడం కోసం జీవితకాలం పెళ్లి , రాజ్యం త్యాగం చేసిన భీష్ముడు. అలాగే పాండవుల పక్షం వస్తే తననే రారాజును చేస్తారని శ్రీకృష్ణుడు ప్రలోభ పెట్టినగాని తాను నమ్మిన మిత్రునికోసము నిలబడ్డాడు తప్ప రాజ్యాన్ని ఆశించని కర్ణుడు, అలాగే రామాయణం నుండి తెలుసుకోవాల్సింది కొడుకును రాజును చేయాలని తలచి రాముని వనవాసానికి పంపిన తల్లిని అసహ్యించుకొని అన్న పాదుకలు తెచ్చుకొని రాజ్యాన్ని పాలించిన భరతుడు ఇలా గొప్ప సందేశాలను ఇచ్చి ఆదర్శంగా నిలిచిన ఇతిహాసాలు పుట్టినిల్లు మన భారతదేశం. అలాంటి దేశంలో నేటి రాజకీయాలను చూస్తే జుగుప్స కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు.


మా చిన్నతనంలో గ్రామంలోని పెద్దలు ఏదో ఒక రాజకీయపార్టీలో జీవితాంతం ఉండేవారు వారిని నమ్ముకున్నవారు కూడా నాయకుని వెంటే అదేపార్టీలో ఉండేవారు. ఎన్నికల ప్రచారంలో వారు పలానా పార్టీ వారు అని వారు మనకు ఓటు వేయరులే అని కనీసం ఓటు అడగడానికి కూడా వేరేపార్టీల వారు వచ్చేవారుకాదు. కానీ ఇప్పుడు గడియారంలో సెకన్ల ముళ్ళు తిరిగినంత వేగంగా జాతీయ నాయకుల నుండి ప్రారంభమై గ్రామస్థాయి వరకు ఎక్కువ శాతం నాయకులు పార్టీలు మారుతున్నారు. ఎవరు అధికారంలోకి వస్తే వారిని ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోపే వెళ్లి జంప్ అవుతున్నారు. బండ భూతులు తిట్టిన ఆ నేతలే ముందస్తు దండాలు పెట్టి దండలతో , శాలువాలతో సన్మానాలు చేస్తూ అధికార పార్టీలలో చేరి వారి స్థానాల కోసం కర్చీఫ్ లు (శాలువాలు) వేసుకొని, కండువాలు ధరించి నిస్సిగ్గుగా ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ భిక్ష పెట్టిన మాతృ పార్టీలను తూలనడుతున్నారు.

ఇదంతా చూస్తూ పెరుగుతున్న నేటి యువనాయకులు ఇదే రాజకీయం అనుకొని విలువలు లేని నాయకులను అనుసరిస్తుంటే సమాజం ఎటుపోతుందో రాబోవు తరం ఏమైపోతుందో అనే ఆవేదన కల్గుతుంది. ఒకప్పటి నాయకులు ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేసిన దేశమేన ఇపుడున్నది అనిపిస్తుంది.


కొందరు నాయకులు తమకు సంపూర్ణ మెజారిటీ ఉన్న తమ వారసులకు అనుభవం సామర్ధ్యం లేవని వేరేవారిని ప్రధానులను చేసిన చరిత్ర నుండి ఎలాంటి అర్హత లేకున్నా తమ పిల్లలను రాజకీయ వారసులుగా నియమిస్తున్న నేటి తరం.


పైగా కొందరు కారుణ్య నియామకాలుగా కూడా రాజకీయ పదవులు పొందుతున్నారు.
ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా దేశ ,రాష్ట్ర రాజకీయాలను చూస్తుంటే వారి భాషను వింటుంటే మొదట్లో అసహ్యం వేసేది . కానీ ఇప్పుడు నేటి తరం ఆ భాషనే మాతృభాషగా ఆచరిస్తారేమో అని భయమేస్తోంది.
ఒకప్పుడు ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉండేవి.

గంగవరం రామకృష్ణారెడ్డి
గంగవరం రామకృష్ణారెడ్డి


కానీ అవి ఇప్పుడు నేతిబీరకాయలో నేతిగా మారిపోయాయి. విద్యావేత్తలు సహితం ఏదో ఉద్దరించాలని బహుజనుల రాజ్యాధికారం కోసం మన పోరాటం ఓటు ధ్వారానే సాధ్యం అంటూ గుంపు కట్టి ఆ గుంపునల్లా కసాయివాడికి అమ్ముకుంటుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి, యువత ఎవరిని అనుసరించాలి.


ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు వందల ఎకరాలను ప్రజలకు పంచితే ఇప్పుడు ఒకేసారి గెలిచిన నాయకులు వందల ఎకరాలు ప్రజల నుండి దోచుకుంటున్నారు.జాతిపితలుగా గౌరవింప పడాల్సిన కొందరు నేతలు అవినీతి , అహంకారం , స్వార్థం వంటి అవలక్షణాలతో అధికారం పోగానే జైలు ఊచలు ఎప్పుడు లెక్కిస్తామో అంటూ నిద్రాహారాలు లేక భీతిల్లుతున్నారు.


వారి పక్కన నాడు నక్కల్లా ఉన్న నాయకులు కొందరు నేడు గత పార్టీలను వీడి అవినీతి మరకలు తొలగించుకోవడానికి అధికార పార్టీలలో చేరుతుంటే వాళ్లలో వారికి నేడు నాటి భూతులే నేడు భగవద్గీత శ్లోకాలయ్యాయ ఏంటని ప్రజలు ముక్కున వేలేసు కుంటున్నారు.నాటి నాయకుల అవినీతి, అహంకారాలు నచ్చకనే వారిని ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఓడిస్తే తాము గెలిపించిన నాయకులేమో వారినే పార్టీలల్లో చేర్చుకొని వారికి మల్లీ కొత్త సంచులు (పార్టీ కండువాలు) ఇచ్చి దోచుకోమని ప్రజలపైకి పంపుతుంటే ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏముంది.


రేపటి పౌరులు ఏ విలువలతో ఎదగాలి. రేపటి భారతం ఏమవుతుందో అనే ఆవేదన, విలువలతో కూడిన సమాజాన్ని ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఆకాంక్షించే ప్రతి సగటు పౌరుని ఆందోళన.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నట్టు పార్టీ మారిన మరుక్షణం పదవి చ్యుతులు అయ్యే చట్టం రావాలి అంతే కాకుండా ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా కనీసం 10 సంవత్సరాలు నిషేధం విధించాలని సగటు భారతీయుడి అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top