పరువు నష్టం దావా వేస్తున్నానన్నా సగర సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మరియు,ఏ-1 కాంట్రాక్టర్ తిరుపతయ్య సాగర్
వనపర్తి చైతన్యగళం ప్రతినిధి : జర్నలిస్టులకు సంబంధించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ,తన పై పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులపై పరువు నష్టం దావా వేస్తున్నానని సగర సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మరియు,ఏ-1 కాంట్రాక్టర్ తిరుపతయ్య సాగర్ అన్నారు.
శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతయ్య సాగర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్ద దగడ గ్రామ శివారులో నిర్మిస్తున్న 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి తన పై చిన్నంబావి మండలానికి చెందిన జర్నలిస్టులు నిరాధారమైన ఆరోపణలు చేసి,తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించారని, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి తనకు డబ్బులు ఇచ్చినట్లు సాక్షాధారాలు చూయించాలని డిమాండ్ చేశారు.
2022 సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖ టెండర్ల ద్వారా 20 బెడ్ రూమ్ ఇండ్లకు నిర్మాణాలకు అగ్రిమెంట్ చేసుకున్నామని, నిర్మాణ స్థలంలో ఇప్పటివరకు రూ.95 లక్షల విలువగల పనులు చేశామని తెలిపారు. దాదాపు 35 సంవత్సరాల నుండి రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్ట్ పనులను మచ్చలేకుండా చేసిన తనపై రూ.2.28 కోట్లు మోసం చేసాడని జర్నలిస్టులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చిన్నంబాయి మండలానికి చెందిన 20 మంది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు వచ్చిన నలుగురు జర్నలిస్టులు వారి మధ్య సఖ్యత లేక అకారణంగా తనపై నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. జర్నలిస్టులతో తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రెండింతల డబ్బు ఇవ్వటానికి సిద్ధమని అన్నారు. ఆరోపణలు చేస్తున్న జర్నలిస్టులు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో జర్నలిస్టులపై పరువు నష్టం దావా వేస్తూ న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఆర్.వి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు చిలుక సత్యం,పల్లె సత్యనారాయణ, వనపర్తి జిల్లా సగర సంఘం సంయుక్త కార్యదర్శి విష్ణు, నాయకులు శ్రీనివాసులు, జనార్దన్,చెన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.