195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన భాజపా

మోదీ
Spread the love

మోదీ, రాజ్‌నాథ్‌, అమిత్‌షా సహా 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు,16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు ఖరారు భాజపా.

 వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒకేసారి 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం ప్రకటించింది. ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు మొత్తం 34 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు తొలి జాబితాలో చోటు లభించింది. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి తిరిగి పోటీపడనున్నారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 195 నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది.

ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 51 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, గుజరాత్‌, రాజస్థాన్‌లలో 15 మంది చొప్పున, కేరళలో 12 మంది, తెలంగాణలో 9 మంది, అస్సాం, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌లలో 11 మంది చొప్పున, ఢిల్లీలో అయిదుగురు, ఉత్తరాఖండ్‌లో ముగ్గురు, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఇద్దరు చొప్పున, గోవా, త్రిపుర, డయ్యు డామన్‌, అండమాన్‌లలో ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను ఖరారు చేశారు. ఢిల్లీలో ఏకంగా నాలుగు స్థానాలలో సిటింగ్‌ అభ్యర్థులు రమేశ్‌ బిధౌరి, పర్వేశ్‌ వర్మ, మీనాక్షి లేఖి, హర్షవర్ధన్‌లను పక్కనపెట్టి ఇతరులకు కేటాయించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌ను కూడా పక్కనపెట్టారు. కాగా బీజేపీ దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్‌ కుమార్తె బాన్సురీ స్వరాజ్‌కు న్యూఢిల్లీ స్థానం నుంచి అవకాశం కల్పించారు. ఆమెకు ఇది తొలి ఎన్నికల సమరం. ప్రస్తుతం ఇక్కడ కేంద్రమంత్రి మీనాక్షిలేఖి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కోట నుంచి స్పీకర్‌ ఓం బిర్లా

ప్రధాని మోదీ తిరిగి యూపీలోని వారణాసి నుంచి, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లక్నో నుంచి, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీని మళ్లీ అదే స్థానం నుంచి రంగంలోకి దింపారు. కాగా రాజస్థాన్‌కు చెందిన కేంద్రమంత్రుల్లో కార్మిక మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఆల్వార్‌ నుంచి, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌ జోధ్‌పూర్‌ నుంచి పోటీ చేయనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోట నుంచి పోటీ చేస్తారు. సినీ నటి హేమమాలిని మళ్లీ మధుర నుంచి పోటీ చేస్తారు.

మఽఽధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విదిశ నుంచి, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌దేవ్‌ త్రిపుర వెస్ట్‌ నుంచి బరిలో ఉంటారు. కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తిరువనంతపురం నుంచి, వి.మురళీధర్‌ అట్టింగల్‌ నుంచి పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, శరభానంద సోనేవాల్‌, కిరణ్‌ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, జితేంద్రసింగ్‌, కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, అర్జున్‌ ముండా తదితరులకు తొలి జాబితాలో చోటు దక్కింది. తొలి జాబితా అభ్యర్థులలో 28 మంది మహిళలు, 47 మంది యువ నేతలు, 27 మంది షెడ్యూల్డు కులాలు, 18 మంది షెడ్యూల్డు జాతులు, 57 మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారున్నారు.

భాజపా
భాజపా

మరింత మెజారిటీ సాధిస్తాం

పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే ఢిల్లీలో ప్రకటించారు. మోదీ సారథ్యంలో మూడోసారి మరింత అధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తొలి జాబితా ఖరారు కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం రాత్రి ఐదు గంటలకుపైగా సమావేశమై కసరత్తు జరిపింది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌షా సభ్యులుగా ఉన్నారు. తదుపరి జాబితా కోసం కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లను, ఎన్‌డీఏ పరంగా 400కుపైగా సీట్లను గెలవాలనే లక్ష్యాన్ని మోదీ నిర్దేశించిన విషయం తెలిసిందే.

నన్ను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించండి : గౌతమ్‌ గంభీర్‌

తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. తాను క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉందని, కొన్ని ఒప్పందాలను పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. గంభీర్‌ ప్రస్తుతం ఈస్ట్‌ ఢిల్లీ ఎంపీగా ఉన్నారు. అయితే, ఈస్ట్‌ ఢిల్లీ సహా ఏ స్థానంలోనైనా అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉన్నవారి జాబితాలో గంభీర్‌ పేరు లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జయంత్‌ సిన్హా కూడా తనకు రాబోయే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వవద్దని బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. పర్యావరణ పరిరక్షణపై ఉద్యమాన్ని కొనసాగించడం కోసం ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు.

Back To Top