ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థుల ఆస్తులు, అప్పుల లెక్కలు లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటిదాకా నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే ఉన్నారు.
హైదరాబాద్: ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థుల ఆస్తులు, అప్పుల లెక్కలు లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటిదాకా నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే ఉన్నారు. నామినేషన్లతో పాటు వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రూ.కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు కలిగిన అభ్యర్థులు కొందరు తమకు సొంతిళ్లు, వాహనాలు లేవని పేర్కొనడం గమనార్హం.
నా భార్య నాకు రూ.1.20 కోట్లు బాకీ: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఆయన సతీమణి రూ.1.20 కోట్లు బాకీ ఉన్నారు. రూ.18.89 కోట్ల విలువైన స్థిరచరాస్తులు కలిగిన ఒవైసీ లోక్‌సభ ఇచ్చే వేతనంతోనే జీవనం సాగిస్తున్నారు. ఎంఐఎం తరఫున హైదరాబాద్ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన అసదుద్దీన్ తన ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. దాని ప్రకారం.. ప్రస్తుతం శాస్ర్తిపురం మైలార్‌దేవ్‌పల్లిలోని తమ నివాసం మొత్తం విస్తీర్ణం 1,30,680 ఎస్‌ఎ్‌ఫటి ఉండగా, ఇందులో 36,250 ఎస్‌ఎ్‌ఫటిలో భవన నిర్మాణం ఉందని తెలిపారు.
ఇందులో తనకు 3/4, భార్యకు నాలుగోవంతు వాటా ఉందన్నారు. 36,250 ఎస్‌ఎ్‌ఫటీల్లో చేపట్టిన భవన నిర్మాణ ఖర్చులో తన భార్య వాటా కింద తనకు రూ.1.20 కోట్లు బాకీ ఉందన్నారు. హైదరాబాద్‌లోని మిస్రీగంజ్‌లో 3843 ఎస్‌ఎ్‌ఫటి స్థలంలో మరో నివాసం ఉందన్నారు. ఈ భవనాన్ని రూ.2.04 కోట్లకు కొనుగోలు చేయగా ప్రస్తుత విలువ దాదాపు రూ.19.65 కోట్లు ఉందని తెలిపారు. మొత్తం రూ. 2.88 కోట్ల విలువైన చరాస్తులు, రూ.16.01 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.18.89 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు.
తన పేరున రూ.4.30 కోట్లు, భార్య పేరుతో రూ. 2.75 కోట్ల చొప్పున మొత్తం రూ.7.05 కోట్ల అప్పులున్నాయన్నారు. లోక్‌సభ ఇచ్చే వేతనమే తన జీవనాధారమని పేర్కొన్నారు. తన వద్ద రూ.2లక్షలు, తన భార్య వద్ద రూ. 50వేలు నగదు ఉండగా.. మూడు బ్యాంకుల్లో కలిపి రూ.1.56 కోట్లు, తన భార్య పేరున ఒక బ్యాంకులో రూ.1.30 లక్షలున్నాయని ప్రకటించారు. తనతోపాటు కుటుంబసభ్యుల పేరిట ఎలాంటి వాహనాలు లేవని తెలిపారు. భార్య పేరిట రూ. 14.41 లక్షల విలువైన 20 తులాల బంగారం ఉందని వెల్లడించారు. ఇక, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, హైదరాబాద్‌లో తనపై మొత్తం 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ప్రకటించారు.,
తాండ్ర దంపతులకు 7 కిలోల బంగారం
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు దంపతుల వద్ద సుమారు ఏడు కిలోల బంగారం ఉంది. వినోదరావు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ఆ దంపతులకు రూ.16.23 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో వినోదరావు పేరిట రూ.11.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులోని రూ.7.04 కోట్ల చరాస్తుల్లో రూ.1.90 కోట్లు విలువ చేసే మూడున్నర కిలోల బంగారం, రూ.1.82 లక్షల విలువైన 32.700 గ్రాముల వెండి ఉన్నాయి. వినోదరావు సతీమణి పేరిట రూ.1.92 కోట్లు విలువ చేసే 3.261 కిలోల బంగారం, రూ.19.66 లక్షల విలువైన 29.800 గ్రాముల వెండి ఉన్నాయి. వినోదరావు పేరిట రూ.3.42లక్షల అప్పులు ఉన్నాయి.
ఆర్ ఎస్ ప్రవీణ్‌కు సొంత వాహనాల్లేవు
నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన కుటుంబానికి రూ.1.41 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన మీద 3 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నట్లు తెలిపారు. రూ.16500 నగదు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. తనతోపాటు తన కుటుంబంలో ఎవరికీ సొంత వాహనాలు లేవని పేర్కొన్నారు.
వంశీచంద్‌కు సొంతిల్లు లేదు
మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి సొంతిల్లు లేదు. తన కుటుంబానికి రూ.3,31,71,049 ఆస్తులు ఉన్నాయని ఆయన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరిట రూ.71,28,903 లక్షల చరాస్తులు, రూ.35 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొనగా, తన భార్య ఆశ్లేషారెడ్డి పేరిట రూ.1,90,42,146 చరాస్థులు, రూ.35ల క్షల విలువ చేసే స్థిరాస్థులు ఉన్నట్లు తెలిపారు. వంశీకి సంబంధించి రూ.15.92 లక్షలు విలువ చేసే 240 గ్రాముల బంగారు, తన భార్యపై రూ.99.54 లక్షలు విలువ చేసే 1500గ్రాముల నగలు, రూ.75 లక్షలు విలువ చేసే వజ్రాల నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. తన స్వగ్రామం అప్పారెడ్డిపల్లిలో 5 ఎకరాలు, తన భార్య పేరిట మరో 5 ఎకరాల భూమి ఉన్నదని వెల్లడించారు. తనకు ఒక ఫార్చునర్ కారు, రూ. 20.76 లక్షల కారు లోను ఉందని వెల్లడించారు.
బూర నర్సయ్య ఆస్తులు 46.99కోట్లు
భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తన కుటుంబానికి రూ.46,99,78,409 ఆస్తులు ఉన్నాయని ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. ఆయన పేరున స్థిర, చరాస్థులు మొత్తం రూ.35,03,18,818, ఆయన భార్య అనిత పేరు మీద రూ.11,96,59,593 ఉన్నాయని తెలిపారు. తనకు రూ.1,28,17,844 అప్పు ఉండగా, భార్యకు రూ.1,93,83,212 అప్పులున్నాయని చెప్పారు.
కోటీశ్వరుడే కానీ కారు లేదు. !
పెద్దపల్లి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన గడ్డం వంశీకృష్ణ కోటీశ్వరుడే కానీ ఆయనకు సొంత కారు లేదు. వంశీకృష్ణ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ.21,59.73,094 స్థిర, చరాస్తులు ఉన్నాయి. స్థిర ఆస్తుల విలువ రూ.4,17,05,497 కాగా, ఆయన భార్య పేరిట రూ.52,03,178 విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే రూ.6.83 కోట్ల విలువైన రుణాలు ఉన్నాయి. వంశీకృష్ణ పేరిట రూ.17,42,67,687 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి కేసులు లేవు.
కొప్పుల ఆస్తులు రూ.1.30 కోట్లు
పెద్దపల్లి బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తనకు రూ.1,30,34,911 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరిట రూ.40 లక్షలు, భార్య పేరిట కోటి 23 లక్షల స్థిర ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆయన పేరిట రూ.90,34,911, భార్య పేరిట రూ.2,69,25,849 విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన వద్ద రూ.20 వేలు, భార్య వద్ద రూ.15 వేలు నగదు ఉందన్నారు. తనకు రెండు ఇన్నోవా వాహనాలు, భార్యకు ఒక బొలేరో వాహనం ఉన్నాయని, తనపై ఎలాంటి కేసుల్లేవని పేర్కొన్నారు. తనకు రూ.28,75,465, భార్య పేరిట రూ.1,74,81,512 అప్పులు ఉన్నాయని ఈశ్వర్ వెల్లడించారు.
కిషన్‌రెడ్డి దంపతుల ఆస్తి 4.53 కోట్లు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్‌రెడ్డి తమ దంపతులకు రూ.4,53,55,087 విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద రూ.70 వేలు, భార్య వద్ద రూ.25 వేలు నగదు ఉన్నదని తెలిపారు. అలాగే తమ కుమార్తె వద్ద రూ.15 వేలు, కొడుకు వద్ద రూ.10 వేలు ఉన్నట్లు చూపించారు. తన పేరిట వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ.18.71 లక్షలు ఉన్నాయని, భార్య కావ్య పేరిట రూ.2.38 లక్షలు ఉన్నట్లు చూపించారు. భార్య పేరు మీద 1.63 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో వివరించారు.
బాజిరెడ్డికి భారీగా భూములు
నిజామాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు రూ.3,85,90,017 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. చీమన్‌పల్లిలో 25 ఎకరాల భూమి, భార్య పేరు మీద 6 ఎకరాల 21 గుంట భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఒక ఇల్లు, రాజేంద్రనగర్‌లో 500 గజాలు, కొండాపూర్‌లో 100 గజాలు, జక్రాన్‌పల్లిలో 6 ఎకరాల 20 గుంటల భూమి, బీబీపూర్‌లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు.
పద్మారావుగౌడ్‌కు స్థిరాస్తుల్లేవు
సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు రూ.2.69 కోట్లు, భార్య స్వరూప పేరిట రూ.92.90 లక్షల విలువైన చరాస్తులున్నాయి. తనకు 600 గ్రాములు, సతీమణికి 750 గ్రాముల బంగారం, 17 కిలోల వెండి ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, తన పేరిట స్థిరాస్తులు లేవని చూపిన ఆయన భార్య పేరిట వివిధ ప్రాంతాల్లో రూ.93.96 లక్షల విలువైన భవనాలు ఉన్నట్టు పేర్కొన్నారు. రూ.97 లక్షల విలువైన వోల్వో కారు, రూ.21.03 లక్షల స్కార్పియో, భార్య పేరిట రూ.20.16 లక్షల హ్యూండయ్ వెర్నా కారు, రూ.50 లక్షల వాహన రుణం ఉన్నట్టు చూపారు.
ధర్మపురి అర్వింద్ స్థిరచర ఆస్తులు రూ.97 కోట్లు
నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తమకు రూ.97,53,52,312 విలువైన స్థిర,చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో ప్రకటించారు. చరాస్తుల విలువ రూ.47,71,90,312, స్థిరాస్తుల విలువ రూ.49,51,62,200గా చూపించారు. భార్య పేరిట రూ.12,11,70,114 విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. డిపెండెంట్ పేరు మీద రూ.24,97,647 ఉన్నట్లు తెలిపారు. తనకు రూ.19,17,38,918లు, భార్య పేరిట రూ.11,43,63,000 అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. తన పేరిట ఓ ఫార్చ్యునర్ కారు, భార్యపేరు మీద ఇన్నోవా కారు ఉన్నట్లు తెలిపారు. 850 గ్రాముల బంగారం, రూ.92,89,000 విలువైన షేర్లు ఉన్నాయని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని కమర్షియల్ బిల్డింగ్‌లో 39,200 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్, నందిహిల్స్‌లో ఒక ప్లాట్ ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై 22 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.
రఘునందన్ ఆస్తులు 21.07 కోట్లు
మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తనకు రూ.21.07 కోట్లు విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.12.94 కోట్లు, చరాస్తులు రూ.9.13 కోట్లుగా చూపించారు. అలాగే, రూ.12.11 కోట్ల రుణాలున్నట్లు తెలిపారు. తన వద్ద రూ.2.5 లక్షలు నగదు ఉందని, బ్యాంకు ఖాతాల్లో రూ.5.2 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. తమ కుటుంబానికి 46.25 ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయని పేర్కొన్నారు. తన భార్య మంజులకు 14 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని వివరించారు.
బలరాంనాయక్‌పై కిడ్నాప్ కేసు
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ తనపై చెన్నైలో కిడ్నాప్ కేసు నమోదైందనిఅఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, తన మీద చెక్ బౌన్స్ సహా ఆరు కేసులు ఉన్నట్లు తెలిపారు. మజీద్‌పూర్‌లో 2కోట్ల విలువ చేసే సాగుభూమి ఉందని, 2.45కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. బంజారా హిల్స్‌లో 50లక్షల విలువైన భవనం ఉందని తన భార్య పేరిట రూ.94,00,392 ఆస్తులున్నట్టు పేర్కొన్నారు.