రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పై సంవత్సర కాలంలో దాదాపు 600 మరణాలు.
రోడ్డున పడుతున్న కుటుంబాలు.
అనాధలుగా మారుతున్న పసిప్రాణులు.
ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.
ప్రమాదాలపై ప్రజలకి అవగాహన సదస్సులు నిర్వహించాలి.
ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి.
హైదరాబాద్ శ్రీశైలం రహదారిని వెంటనే నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలి మరియు డివైడర్ను నిర్మించాలి.
రోడ్డు ప్రమాదాలపై నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్,తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ వ్యాఖ్యలు.
హైదరాబాద్ (చైతన్యగలం)స్పెషల్ డెస్క్: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి మరియు కోదాడ-జడ్చర్ల రహదారులపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ మరియు టిపిసిసి అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ స్పందించారు.
చైతన్యగలం దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జాతీయ రహదారులపై డివైడర్లు లేని కారణంగా వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండడంతో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి మరియు కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారులపై ఈ విధంగా రద్దీ పెరగడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి అని రహదారులు రక్తమోడుతున్నాయి అని ప్రతిరోజు కనీసం నాలుగు లేదా ఐదు మరణ వార్తల వినాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్లు బాగుపడ్డాయి అని ఆనందించాలో లేదా నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తున్నారు అని బాధపడాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది అని ఆయన వాపోయారు.ఇన్ని జరుగుతున్నా కూడా నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
సంవత్సర కాలంలో 600 మంది ఈ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో మరణించారని ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని ఆయన అన్నారు.600 మంది మరణించారు అంటే 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని అర్థం అని ఆయన అన్నారు.అనేక మంది చిన్నారులు అనాధలుగా మారారని,రోడ్డు ప్రమాదాలతో కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థలో ఇతర అసాధారణ మరణాలు సంభవించినప్పుడు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చట్టాలు ఉన్నాయని కానీ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరంగా భరోసా కల్పించి వారిని ఆదుకునేలా చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.బీమా ద్వారా డబ్బులు వచ్చినా కూడా అవి కుటుంబ అవసరాలు తీర్చేది కావని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం,అధికారులు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని,అధికారులు దానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించాలని వాటిని ప్రభుత్వంతో మాట్లాడి చట్టాలుగా మార్చే బాధ్యత ప్రజాప్రతినిధులుగా తాము తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాలాజీ సింగ్ రవాణా శాఖ అధికారులకు మరియు ఇతర శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
- రవాణా శాఖ అధికారులు వాహనదారులకి లైసెన్సులు జారీ చేసే సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవ్ టెస్ట్ ట్రాకులు ఆధునికరించాలి అని అర్హులకు మాత్రమే లైసెన్సులు కేటాయించాలి అని ఆయన సూచించారు.
- మైనర్లు వాహనాలు నడపడం విపరీతంగా పెరిగింది అని ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించి కఠినమైన చట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
- మద్యం విచ్చలవిడిగా ప్రజల్లోకి వెళ్లింది అని దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు అని మద్యం సేవించి వాహనాలు నడపకుండా పూర్తిస్థాయి అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు.
- ప్రత్యేకమైన డ్రంక్ అండ్ డ్రైవ్ శిబిరాలు నిర్వహించి టోల్గేట్ల వద్ద తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని,మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకొని వారి వాహనాలను తక్షణం సీజ్ చేసేలా చట్టం రూపొందించాలని బాలాజీ సింగ్ అన్నారు.
- వాహనదారులకు వేగ నియంత్రణ కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారు వెళ్లే వేగాన్ని సూచించేలా డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేయాలి అని స్పీడ్ లిమిట్ పై వాహనదారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని ప్రమాదకరమైన వంపులపై సూచిక బోర్డులు పెంచాలి అని ఆయన సూచించారు.
- ఆర్టీసీ బస్సులు సైతం విపరీతమైన వేగంతో వెలుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి అని వీటిపై ఆర్టీసీ డ్రైవర్లకు సిబ్బందికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అని ఆయన అన్నారు.
- హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్లుగా తక్షణమే విస్తరించి మధ్యన డివైడర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సాంకేతికతను జోడించాలని ఆయన అన్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
- జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు అధికారులు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి దాన్ని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి వెంటనే అందించాలి అని ఆయన అన్నారు సంబంధిత మంత్రితో చర్చిస్తా అని అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి వాటిని చట్టాలుగా చేసే బాధ్యత తాను తీసుకుంటా అని నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ అన్నారు.
- భద్రతను పాఠ్యాంశాలలో చేర్చి ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించిన విధానాలపై విద్యార్థి దశ నుండే చైతన్యం తీసుకురావాలి అని విద్యాశాఖ అధికారులకు సూచన చేశారు.
- పరిమితికి మించిన బరువుతో రోడ్లపైకి వచ్చే వాణిజ్య వాహనాల కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అని అధికారులు వాటిపై కూడా దృష్టి సారించాలి అని బాలాజీ సింగ్ అన్నారు.
- ప్రమాదాల నివారణను ప్రజలు సైతం సామాజిక బాధ్యతగా భావించి తమ వంతు పాత్ర పోషించాలని బాలాజీ సింగ్ పిలుపునిచ్చారు.