డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను (AEOs) సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రకటనలో, డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలను వేధించడం తగదని, ఇది దారుణమని పేర్కొన్నారు.
హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను (ఏఈఓలు) వివిధ కారణాలతో సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. డిజిటల్ సర్వే పేరుతో ఏఈఓలపై వేధింపులు తగవని ఆయన అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏజెన్సీలు, ఇతర శాఖల సహాయంతో సర్వేలు జరుగుతుంటే, తెలంగాణలో మాత్రం ఏఈఓల నెత్తిన ఈ భారం ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు.
రైతులకు మేలు చేసేందుకు ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించి, 1500 కొత్త ఏఈఓల పోస్టులను సృష్టించి, 2601 రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
అయితే, డిజిటల్ సర్వే కోసం విడుదలైన నిధులను పక్కదారి పట్టించడం ఎందుకు జరుగుతుందో ప్రశ్నించారు. ఏఈఓలలో అత్యధికులు మహిళలు ఉన్నారని, క్రాప్ సర్వే పేరుతో వారిని నిర్మానుష్య వ్యవసాయ కమతాలకు రక్షణ లేకుండా పంపించడం సరికాదని అన్నారు.
ప్రజా పాలన అంటే బెదిరింపులేనా? అని ప్రశ్నించిన సింగిరెడ్డి, డిజిటల్ సర్వేకు అవసరమైన సహాయకులను నియమించి, ఏజెన్సీలకు పనిని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.