విజయ్ పార్టీకి చెక్ పెట్టేందుకు డీఎంకే సరికొత్త వ్యూహం..!

విజయ్
Spread the love

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు హీరో విజయ్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభావం తమిళ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుందోనని ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు హీరో విజయ్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభావం తమిళ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుందోనని అన్ని ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా అధికార డీఎంకే – కాంగ్రెస్ కూటమి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బలమైన కూటమితో అన్నాడీఎంకే, బీజేపీలను చిత్తుచేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పుడు విజయ్ పార్టీ కూడా బరిలో నిలుస్తుండటంతో డీఎంకే సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా కమల్ హాసన్‌‌కు చెందిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) కూడా డీఎంకే కూటమిలో చేర్చుకునే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియా కూటమిలో చేరేందుకు కమల్ హాసన్ రెండు సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తమ కూటమిలో కమల్ హాసన్ చేరికతో విజయ్ పార్టీ జోరుకు అడ్డుకట్ట వేయొచ్చని డీఎంకే నేతలు భావిస్తున్నారు.

2018లో రాజకీయ పార్టీని స్థాపించిన దిగ్గజ నటుడు కమల్ హాసన్.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మూడో కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుని.. కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్‌తో పాటు ఆ పార్టీ అభ్యర్థులందరూ పరాజయం పొందారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ ప్రాభవాన్ని ఎదుర్కొనేందుకు కమల్ హాసన్ చేరిక కలిసొస్తుందని డీఎంకే నేతలు భావిస్తున్నారు. అందుకే ఎంఎన్ఎంను కూడా డీఎంకే కూటమిలోకి తీసుకొస్తోందన్న ప్రచారం జరుగుతోంది. డీఎంకే – కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కమల్ హాసన్ అంగీకరించారని తెలుస్తోంది. చెన్నై, కోయంబత్తూరులో ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగే పార్టీ కీలక సమావేశాల తర్వాత దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దక్షిణ చెన్నై, కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎంఎన్ఎం పోటీచేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి కమల్ హాసన్ బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు  చిన్నాచితక పార్టీలతో పొత్తు చర్చలు కొనసాగిస్తున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి డీఎంకే – కాంగ్రెస్ పార్టీల మధ్య మొదటి విడత చర్చలు ఇప్పటికే ముగిశాయి. రెండో విడత చర్చలు ఆ పార్టీ నేతల మధ్య ఫిబ్రవరి 4, 5 తేదీల్లో చెన్నైలో జరిగే అవకాశముంది. అటు అన్నాడీఎంకే కూడా చిన్నా చితక పార్టీలతో పొత్తుకు సంబంధించిన చర్చలు జరుపుతోంది.

డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్(ఐయూఎంఎల్) కొనసాగుతున్నాయి. ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ కూడా చేరితే ఆ కూటమికి మరింత బలం చేకూరే అవకాశముంది. మొత్తం 39 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 2, ఎండీఎంకే 2, ఎంఎన్ఎం 2, ఐయూఎంఎల్‌కు 1 సీటు ఇచ్చే యోచనలో డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 20 స్థానాల్లో డీఎంకే పోటీచేస్తుంది.  పుదుచ్చేరి నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి కేటాయించే అవకాశముంది.

Back To Top