స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్‌నూ తాకింది..! ఇప్పటికే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ మాదిరి విభాగానికి(ఎ్‌సవోటీ) ఇన్‌చార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ట్యాపింగ్ నిందితుల కస్టడీపై నేడు తీర్పు
గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు!!
నాన్-క్యాడర్ అయినా.. కీలక పోస్టింగ్‌లు
తాజాగా గుర్తించిన పంజాగుట్ట పోలీసులు
ట్యాపింగ్‌లో 15 మంది ఎస్‌ఐబీ అధికారుల పాత్ర
వారికీ నేడోరేపో నోటీసులు.. స్పెషల్ టీమ్‌ల స్వకార్యాలు.. రూ.కోట్ల ఆర్జన
రికార్డింగ్ వినిపించి బెదిరింపులు, దాడులు.. ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్‌లు
మహబూబ్‌నగర్‌లో పోలీస్‌స్టేషన్ పక్కనే ట్యాపింగ్ కేంద్రం
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వార్‌రూం!
హైదరాబాద్ /సిటీ, కామారెడ్డి, మేళ్లచెర్వు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్‌నూ తాకింది..! ఇప్పటికే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ మాదిరి విభాగానికి(ఎ్‌సవోటీ) ఇన్‌చార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్-క్యాడర్ అధికారే అయినా.. ఆయన ఆ కమిషనరేట్‌లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు డీసీపీగా పనిచేసినట్లు సమాచారం.
సదరు అధికారి తన టీమ్‌తో కలిసి రూ.కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా కీలకమైన జోన్లు కావడంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసి, విధేయతను చాటుకున్నారని సమాచారం. సదరు డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు కావడంతో.. సీపీ స్థాయి అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదని భావిస్తున్నారు. ఆ డీసీపీ సూచనల మేరకు ఎస్‌ఐబీ నుంచి ప్రణీత్‌రావు.. కన్‌స్ట్రక్షన్, ఫార్మా కంపెనీలు, సెలబ్రిటీలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. శివార్లలో దందాలను ఈ డీసీపీ చూడగా..
హైదరాబాద్‌లో రాధాకిషన్‌రావు కీలకంగా వ్యహరించారని, బ్లాక్‌మెయిల్స్ ద్వారా కోట్లమేర అక్ర మ వసూళ్లకు పాల్పడ్డారని గుర్తించినట్లు తెలిసింది.
ఎస్‌ఐబీలో 15 మంది పాత్రధారులు
ఎస్‌ఐబీలో సేవలందించిన 15 మంది అధికారులు, సిబ్బందికి ఈ కేసుతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరంతా ఏళ్ల తరబడి ఇంటెలిజెన్స్‌లో పాతుకుపోయినట్లు తెలుస్తోంది. కొందరైతే ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో పదవీ విరమణ చేసినా.. ఓఎస్డీలుగా కొనసాగారు. ట్యాపింగ్ వ్యవహారంలో వీరు కూడా కీలక పాత్రధారులు అని తెలుస్తోంది. ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలు, ప్రణీత్‌రావు సూచనలతో జిల్లాల్లోని వార్‌రూమ్‌లలో మకాం వేసి.. ట్యాపింగ్ వ్యవహారాలను చక్కబెట్టారని స్పష్టమవుతోంది.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాడు ప్రణీత్‌రావు కంప్యూటర్లు, హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేయగా.. వాటి శకలాలను పారవేయడంలో ఈ 15 మందిలో కొందరి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ నోటీసులు జారీ చేసి, విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావుకస్టడీకి కోర్టు అనుమతినిచ్చాక.. ఒక్కొక్కరినీ విడివిడిగా.. కలిపి.. పైన పేర్కొన్న 15 మంది ముందు కూర్చోబెట్టి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఈ 15 మందికి సహకరించిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలపైనా అధికారులు దృష్టి సారించారు.
పక్క రాష్ట్రాలనూ తాకిన ట్యాపింగ్
ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క రాష్ట్రాలను కూడా తాకినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ముఖ్యనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే తేలినా.. తాజాగా ఏపీలోనూ కొందరు నాయకులను టార్గెట్‌గా చేసుకుని, వారి ఫోన్లపై నిఘా పెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో తాత్కాలికంగా సర్వర్ రూమ్‌లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ శివారు ప్రాంతాల్లో అడ్డా వేసి.. ట్యాపింగ్‌లు చేసినట్లు సమాచారం. అయితే.. ఏపీలో ఎవరిని టార్గెట్‌గా చేసుకున్నారు? ఏ పార్టీ వారు టార్గెట్? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు
భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావును పోలీస్ కస్టడీకి పంజాగుట్ట పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారమే వాదనలు పూర్తయ్యాయి. బుధవారం కౌంటర్ పిటిషన్ వేయాలంటూ నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు సూచించింది. నిందితుల తరపు న్యాయవాదులు మరో రోజు గడువు కావాలని కోరడంతో.. న్యాయమూర్తి తీర్పును గురువారానికి వాయిదా వేశారు.
మేళ్లచెర్వులో ప్రకంపనలు..
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోనూ ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఓ పరిశ్రమ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ట్యాపింగ్‌కు కేంద్రబిందువైనట్లు ఆరోపణలున్నాయి. ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన అదనపు ఎస్పీ తిరుపతన్నతోపాటు.. మరో డీఎస్పీ శ్రీనివాసనాయుడు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకు మూడ్రోజుల ముందే వీరిద్దరూ మేళ్లచెర్వుకు చేరుకున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తున్న స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, స్థానిక మీడియా ప్రతినిధుల ఫోన్లను వీరు ట్యాప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తారనుకునే వారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముందుగానే గుర్తించి, రాత్రికి రాత్రే అరెస్టులు చేసినట్లు ఇప్పుడు మండలంలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ అధికారులు ఇక్కడికి ఎందుకు వచ్చారని అప్పట్లోనే స్థానిక న్యాయవాది నాగార్జున నిలదీశారు. సమాచార హక్కు చట్టం కింద అప్పటి సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను వివరాలు అడిగారు. దానికి కోదాడ డీఎస్పీ ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఎలాంటి ఆందోళన జరగకుండా హైదరాబాద్ నుంచి బందోబస్తుకు అదనపు సిబ్బందిని రప్పించినట్లు తెలిపారు. అయితే.. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావుకు, సదరు పరిశ్రమ యజమానికి ఉన్న సత్సంబంధాల కారణంగానే.. ప్రజాభిప్రాయ సేకరణ సవ్యంగా సాగిందని చూపేందుకు ట్యాపింగ్‌లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.
కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చీఫ్, అప్పటి సీఎం కేసీఆర్ గజ్వేల్‌తోపాటు.. కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీఎం, అప్పటి విపక్ష నేత రేవంత్‌రెడ్డి కూడా కొడంగల్‌తోపాటు.. కామారెడ్డి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఇద్దరూ కామారెడ్డి నుంచి విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ విజయం కోసం ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు కామారెడ్డిలోని విద్యానగర్‌లో ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ ఓ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దర్యాప్తులో స్పష్టమైంది. ఈ వార్‌రూమ్‌కు బీఆర్‌ఎ్‌సకు చెందిన ఓ ముఖ్యనేత ఇన్‌చార్జిగా ఉండేవారని, ఇక్కడి నుంచే కాంగ్రెస్ ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. అప్పట్లో రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి, కామారెడ్డి వైస్‌చైర్‌పర్సన్ ఇందుప్రియ, నిజాంసాగర్ రోడ్ ప్రాంతంలో ఓ కాంగ్రెస్ నేతకు చెందిన సంస్థలపై పోలీసులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రె్‌సకు చెందిన ఐదుగురు కీలక నేతల ఫోన్లను ఇక్కడి నుంచి ట్యాప్ చేశారని సమాచారం.
పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో.. ఓ పోలీ్‌సస్టేషన్ పక్కనే ఉన్న భవనం కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లు పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆ భవనం ఓ మాజీ మంత్రి బినామీకి చెందినదని తెలుస్తోంది. అప్పట్లో విపక్ష నాయకులుగా ఉన్నవారు కూడా ఒక్కొక్కరుగా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో వీటి దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.