ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. అశోక్ గెహ్లాట్‌కి ఎదురుదెబ్బ!

అశోక్
Spread the love

రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ ఫోన్ ట్యాపింగ్‌తో పాటు రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో.. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై ఆయన మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ తాజాగా

రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ ఫోన్ ట్యాపింగ్‌తో పాటు రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో.. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై (Ashok Gehlot) ఆయన మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో గెహ్లాట్ తనకు కొందరు మంత్రుల ఆడియో క్లిప్స్‌తో కూడిన ఓ పెన్‌డ్రైవ్ ఇచ్చారని, వాటిని మీడియాకు లీక్ చేయమని చెప్పారంటూ కుండబద్దలు కొట్టారు. తనకు సోషల్ మీడియా ద్వారా ఆ క్లిప్స్ దొరికాయని గతంలో చెప్పానని, నిజానికి గెహ్లాట్ ఓ పెన్‌డ్రైవ్‌లో ఆ వాయిస్‌లను ఇచ్చారని బాంబ్ పేల్చారు.

లోకేష్ శర్మ (Lokesh Sharma) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో తనని ఎన్నిసార్లు విచారించినా నేను మౌనంగానే ఉన్నా. కానీ, ఈ ఘటనకు కారకులైన వ్యక్తి ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని నిర్ణయించారు. అందుకే.. అసలు నిజాలు బయటపెట్టేందుకు వచ్చాను. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ నేత భన్వర్‌లాల్ శర్మతో పాటు మరికొందరు రికార్డింగ్స్ నాకు సోషల్ మీడియా ద్వారా అందాయని చెప్పాను. కానీ అది నిజం కాదు, గెహ్లాట్ ఆ క్లిప్స్‌తో నిండిన పెన్‌డ్రైవ్‌ని నాకు ఇచ్చారు. తన నివాసానికి పిలిపించి మరీ ఆ పెన్‌డ్రైవ్‌ని ఆయన నాకిచ్చి, వాటిని మీడియాకు విడుదల చేయమని చెప్పారు’’ అని చెప్పుకొచ్చారు. రీట్ పేపర్ లీక్ వ్యవహారంలోనూ.. తన సన్నిహితులకు గెహ్లాట్ రక్షణ కల్పించారని ఆయన ఆరోపించారు.

గెహ్లాట్ రాజస్థాన్ సీఎంగా ఉన్నప్పుడు.. ఆయన నాయకత్వంలోని నాయకత్వంలోని సమస్యల గురించి చెప్పేందుకు సచిన్ పైలట్ (Sachin Pilot), ఆయన సన్నిహితులు కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు వెళ్లారని లోకేష్ శర్మ తెలిపారు. ఈ విషయం తెలియగానే.. వారి ఫోన్లను గెహ్లాట్ ట్యాప్ చేయించారని పేర్కొన్నారు. అలాగే.. పైలట్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను సైతం గెహ్లాట్ దెబ్బతీశారని చెప్పారు. ఈ సందర్భంగా.. ఫోన్ రికార్డింగ్స్ గురించి తమ మధ్య జరిగిన సంభాషణని కూడా మీడియా సమావేశంలో వినిపించారు. తన ప్రయోజనాల కోసం గెహ్లాట్ మనుషుల్ని ఉపయోగించుకొని, ఆ తర్వాత వదిలేస్తారని శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రికార్డింగ్స్ వెనుక తన ప్రమేయం లేదని, దీని వెనుక అసలు వ్యక్తి గెహ్లాట్ అని వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా.. 2020 జులైలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో కొందరి ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణలు లీక్ అయ్యాయి. వాటిల్లో.. తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్ లాల్, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ కూడా ఉంది. ఈ క్రమంలో.. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజకీయ దుమారం రేగింది. కాగా.. ఈ ఆడియో సంభాషణల్ని లోకేష్ లీక్ చేశారంటూ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసుని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న లోకేష్.. తాజాగా మీడియా ముందుకొచ్చి గెహ్లాట్‌పై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

Back To Top