తెలంగాణ దేవాదాయశాఖ ప్రక్షాళన ?

తెలంగాణ
Spread the love

దేవాదాయ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. నాయకుల అండదండలతో కొందరు అధికారులు దేవాదాయ శాఖలో ఏళ్లతరబడి చక్రం తిప్పుతున్నారు. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా పరిస్థితి

ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం

యాదాద్రి, వేములవాడపైనా సర్కారు దృష్టి

ఉన్నతాధికారులతో త్వరలో మంత్రి సమీక్ష?

దేవాదాయ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. నాయకుల అండదండలతో కొందరు అధికారులు దేవాదాయ శాఖలో ఏళ్లతరబడి చక్రం తిప్పుతున్నారు. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా పరిస్థితి ఉంది. విజిలెన్స్‌ కేసులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం కీలక పోస్టుల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఇక కొందరు అధికారుల తీరుతో చాలా సంవత్సరాలుగా పదోన్నతులు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం దేవాదాయ శాఖపై దృష్టి సారించింది. అన్ని శాఖలపైనా సమీక్షిస్తూ, ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతున్న రేవంత్‌ సర్కారు.. కీలకమైన దేవాదాయ శాఖపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్‌ను త్వరలో మార్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఐదేళ్ల నుంచి పదవిలో కొనసాగుతున్నారు. పదవీ విరమణ చేసి రెండేళ్లైనా.. గత ప్రభుత్వం ఆయన్నే కొనసాగిస్తూ వచ్చింది.

ఆ అధికారులకు స్థానచలనం..

యాదాద్రి ఆలయ ఈవోగా కొనసాగిన గీత.. కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశారు. ఇదే క్రమంలో ప్రస్తుత కమిషనర్‌ను తప్పించి ఆయన స్థానంలో పూర్తిస్థాయి అధికారిని నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కొందరు అధికారులు రాజకీయ అండదండలతో కీలక పోస్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్నారు. అలాంటి వారికి స్థానచలనం కల్పించి, పదోన్నతులతో ఆయా పోస్టుల్లో కొత్త వారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఒకే ఈవో పలు ఆలయాలకు ఇన్‌చార్జిగా కొనసాగుతుండడంతో ఆలయాలపై పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విలువైన ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.

తెలంగాణ
తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యం వల్లే విలువైన భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదాద్రి, ఆ తర్వాత వేములవాడపైనా ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. యాదాద్రిలో పార్కింగ్‌, ఇతర సదుపాయాల విషయంలో భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయా సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమవుతోంది. వేములవాడ అభివృద్ధితోపాటు ఇతర ఆలయాల అభివృద్ధి పనులపైనా త్వరలో నిర్ణయాలు తీసుకోనుంది. ఆలయ పాలకమండళ్లను రద్దు చేసి, కొత్త వారిని నియమించనుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ.. అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించారు. త్వరలో ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

బ్రాహ్మణ పరిషత్‌ పరిస్థితేంటి?

బ్రాహ్మణుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేసింది. పరిషత్తు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వం మారడంతో పరిషత్తు చైర్మన్‌గా ఉన్న కేవీ రమణాచారి బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది సుమారు 3 నెలలుగా వేతనాలు అందక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదన్‌ మనుగడ అంతంత మాత్రంగానే ఉంది. కరెంట్‌ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం పరిషత్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తుందా? పరిషత్తు మనుగడ కొనసాగుతుందా? అనేది ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.

సిబ్బంది కొరతతో ఇబ్బంది..

దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత మరో సమస్యగా మారింది. కమిషనర్‌ నుంచి స్వీపర్‌, వాటర్‌ ఉమెన్‌ వరకు మొత్తం మంజూరైన పోస్టులు 593 కాగా.. 245 పోస్టులు ఖాళీగాఉన్నాయి.

Back To Top