హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక స్థలమైన హుస్సేన్‌సాగర్ తీరాన కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ భారీ విగ్రహం, అమరుల స్మృతి చిహ్నం ప్రజా సందర్శన లేక కళ కోల్పోతున్నాయి.
హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక స్థలమైన హుస్సేన్‌సాగర్ తీరాన కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ భారీ విగ్రహం, అమరుల స్మృతి చిహ్నం కళ కోల్పోతున్నాయి. వీటి నిర్మాణాలు పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రజా సందర్శనకు అనుమతించకపోవడంతో సందడి. నిర్వహణ లేక వెలవెలబోతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ట్యాంక్‌బండ్‌కు వచ్చిన వారికి సెల్ఫీ పాయింట్లుగా మిగిలిపోతున్నాయి. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రూ.146 కోట్లకు పైగా వ్యయంతో 125 అడుగుల ఎత్తు, 45.4 అడుగుల వెడల్పు, 465 టన్నుల బరువు కలిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
ఈ విగ్రహం దిగువన 50 అడుగుల ఎత్తు, 172 అడుగుల వెడల్పున ఉన్న పీఠంలో గ్రంథాలయం, మ్యూజియం, జ్ఞాన మందిరం, అంబేడ్కర్ జీవిత ముఖ్య ఘట్టాల ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ పనులన్నీ పూర్తయినా సందర్శకులను లోపలికి అనుమతించడం లేదు. నిర్వహణ లేక పీఠంలోని నిర్మాణాలు పాడైపోతున్నాయి. మరోపక్క, ప్రపంచంలోనే అతి పెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణంగా పేరొందిన అమరుల స్మృతి చిహ్నం పరిస్థితి కూడా ఇలానే తయారైంది. 3.29ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.179 కోట్లతో మూడు అంతస్తులతో చేపట్టిన ఈ నిర్మాణం.. తెలంగాణ కోసం అమరులైన వారి త్యాగానికి గుర్తుగా నిరంతరం వెలిగే జ్యోతి రూపంలో ఉంటుంది. ఈ స్మృతి చిహ్నం లోపలి భాగంలో మూడంతస్తుల్లో మ్యూజియం, కన్వెన్షన్ హాల్‌తోపాటు జ్యోతిని సందర్శించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ కన్వెన్షన్ హాల్ సభలు, సమావేశాల నిర్వహణకు అనువుగా ఉండడంతో పాటు ఆదాయం తెచ్చిపెడుతుంది. కానీ ప్రస్తుతం నిరుపయోగంగా మిగిలింది. కాగా, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని పార్కులను నిర్వహిస్తున్న హెచ్‌ఎండీఏ ఈ అమరుల స్మృతి చిహ్నం, అంబేడ్కర్ విగ్రహ నిర్వహణకు సిద్ధంగా ఉంది. కానీ, ఆర్ అండ్ బీ అధికారులు హెచ్‌ఎండీఏకు అప్పగించేందుకు తాత్సారం చేస్తున్నారు. వెరసి పట్టించుకునే వారు లేక ఆయా ప్రాంగణాలు దుమ్ము పట్టిపోతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు ఈ కట్టడాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.