బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం

మోదీ
Spread the love

ఎన్నికల బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవహిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించి పారదర్శకత వచ్చిందని అన్నారు.

ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చింది

రద్దుతో పరిస్థితి మళ్లీ మొదటికి.. దానివల్ల అందరూ బాధపడతారు

400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారనేది దుష్ప్రచారం

దేశంలో ప్రజాస్వామ్యం ఉంది.. సుప్రీం లీడర్‌ ఎవరూ ఆవిర్భవించలేరు

ఈడీ, సీబీఐల దుర్వినియోగం ఆరోపణ.. ఓటమికి విపక్షాల సాకు

ఈడీ కేసుల్లో 3 శాతమే రాజకీయ నేతలపై.. 97 % నేరస్థులపైనే

2047 నాటికి భారత్‌ను అగ్రదేశంగా నిలపడమే నా లక్ష్యం

దేశం కోసమే పెద్ద నిర్ణయాలు.. ఎవరూ భయపడాల్సిన పని లేదు

సనాతన ధర్మం మన రాజ్యాంగంలోనూ ఉంది

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలు.

న్నికల బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవహిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించి పారదర్శకత వచ్చిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. కార్పొరేట్‌ కంపెనీలను ఈడీ, సీబీఐలతో బెదిరించి బీజేపీకి విరాళాలు ఇప్పించుకున్నారనే ఆరోపణలో నిజం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏకు 400 సీట్లు లభిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు.

దేశంలో క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకొని ఉందని, అటువంటప్పుడు, ప్రజాస్వామ్యానికే ప్రమాదకారిగా మారే ఓ సుప్రీం లీడర్‌ ఆవిర్భవించే పరిస్థితే తలెత్తదన్నారు.

సోమవారం ఏఎన్‌ఐ వార్తాసంస్థ ఎడిటర్‌ స్మితా ప్రకాశ్‌కు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు అంశాలపై సవివరంగా మాట్లాడారు. బీజేపీ 400 సీట్లు గెలిస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మోదీ ఖండించారు.

ప్రతిపక్షాలు కుటిలంగా ఆలోచించి దాన్ని దేశంలో చలామణి చేయాలని అనుకుంటున్నాయన్నారు. ఎన్నికల బాండ్ల వల్ల నిధులు పారదర్శకంగా ఏయే పార్టీలకు అందాయో స్పష్టంగా తెలుస్తుందని, ఎన్నికల బాండ్లు లేకపోతే ఆ పరిస్థితి ఉండదని.. మళ్లీ దేశాన్ని నల్లధనం వైపు తీసుకెళ్లామని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరికి వెళ్లాయో తెలిసే పరిస్థితే ఉండదని, దీనివల్ల అందరూ బాధపడే రోజు వస్తుందన్నారు.

కార్పొరేట్‌ కంపెనీలను ఈడీ, సీబీఐలతో బెదిరించి బీజేపీకి విరాళాలు ఇచ్చేలా చేశారన్న ఆరోపణలను మోదీ ఖండించారు. మొత్తం 3 వేల కంపెనీలు ఎలక్టోరల్‌ బాండ్లు కొంటే, వాటిలో 26 కంపెనీల మీద మాత్రమే దర్యాప్తు జరిగిందని, సదరు సంస్థలు ఇచ్చిన విరాళాల్లో 37 శాతం మాత్రమే బీజేపీకి వచ్చాయని, 63 శాతం బీజేపీయేతర పార్టీలకు వెళ్లాయని చెప్పారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. అది దేశ ఆర్థికవ్యవస్థను పూర్తిగా దిగజారస్తుందన్నారు. తొలిసారి ఓటు వేసే యువతీ యువకుల ఆకాంక్షలను అది పూర్తిగా ధ్వంసం చేస్తుందని, 25 ఏళ్లలోపు యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని విమర్శించారు.

తన హయాంలో యువత జీవితాలు మెరుగుపడ్డాయని, ఆర్థికంగా నష్టం వస్తున్నా డేటాను తక్కువ ధరకు అందిస్తున్నామని, దీనివల్ల దేశంలో యువత డిజిటల్‌ విప్లవం తీసుకొస్తోందన్నారు. వచ్చే 25 ఏళ్ల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఈడీ, సీబీఐ దుర్వినియోగం అబద్ధం

ఈడీ, సీబీఐ వంటి సంస్థలు బీజేపీ చెప్పినట్లు పని చేస్తున్నాయని, ఈవీఎంలను కూడా దుర్వినియోగపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను మోదీ కొట్టివేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటమికి ప్రతిపక్షాలు ఈ విధంగా కారణాలను వెతుక్కుంటున్నాయని ఎద్దేవా చేశారు.

ఈడీ, సీబీఐకి సంబంధించిన ఏ చట్టాలనూ తమ ప్రభుత్వం చేయలేదని, అవన్నీ కాంగ్రెస్‌ హయాంలో రూపొందించినవేనని చెప్పారు. ఈడీ పెట్టిన కేసుల్లో 3ు మాత్రమే రాజకీయ నేతలపై నమోదయ్యాయని, మిగిలిన 97ు కేసులు రాజకీయాలకు సంబంధించని వారి మీద ఉన్నాయని స్పష్టం చేశారు.

2014కి ముందు ఈడీ రూ.34 కోట్ల నగదును మాత్రమే స్వాధీనం చేసుకుందని, గత పదేళ్లలో ఈ మొత్తం రూ.2,200 కోట్లకు పెరగిందన్నారు. గతంలో ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్ల నియామకాలు పూర్తిగా ప్రధానమంత్రి విచక్షణ మేరకు జరిగేవని, దానిని మార్చి ప్రతిపక్షానికి కూడా తాము చోటు కల్పించామని మోదీ గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో నియమించిన ఎన్నికల కమిషనర్లు ఆ పార్టీ అధినేతల కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ఉదంతాలు ఉన్నాయని, కొందరు కమిషనర్లకు పదవీకాలం పూర్తయిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా, మంత్రులుగా పదవులు కూడా ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. బీజేపీ ఆ స్థాయికి దిగజారదని చెప్పారు.

‘2024 ఎన్నికల రూపంలో దేశ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. 50-60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ నమూనా ప్రభుత్వం ఉంది. మరోవైపు, నా పదేళ్ల పాలన ఉంది. (నా హయాంలో) తప్పులు జరిగి ఉండవచ్చు.

కానీ, ప్రయత్న లోపం మాత్రం లేదు. అన్ని రంగాల్లో ఈ రెండు ప్రభుత్వాలను పోల్చి చూసి ఓటేయండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఎన్నికలు కాగానే పెద్ద నిర్ణయాలు

2047 కల్లా దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చడమే తన లక్ష్యమని, ఇది మొత్తం దేశ ప్రజల ఆకాంక్ష అని మోదీ తెలిపారు. దీని కోసం ఒక్క నిమిషం కూడా వృథా చేయదలుచుకోలేదని, అందుకనే ఎన్నికలకు ముందు నుంచే దీనిపై పని చేస్తున్నానన్నారు.

మూడోసారి అధికారంలోకి రాగానే తొలి 100 రోజుల్లో చేపట్టాల్సిన పనుల గురించి ఇప్పటికే కసరత్తు జరిపామని గుర్తు చేస్తూ, 2019లో కూడా ఎన్నికలకు ముందే ఈ పని చేశామని చెప్పారు. ఎన్నికలైన తొలి వంద రోజుల్లోనే ఆర్టికల్‌ 370 రద్దు, త్రిపుల్‌ తలాక్‌పై నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు.

ఈసారి కూడా పెద్ద నిర్ణయాలు ఉంటాయని, దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తాను ఏ నిర్ణయమైనా తీసుకుంటానని, ఎవరూ భయపడనక్కర్లేదని ప్రధాని తెలిపారు. జమిలి ఎన్నికలకు తాము కట్టుబడి ఉన్నామని, దేశంలో మెజార్టీ ప్రజలు ఇందుకు మద్దతుగా ఉన్నారని, అనేక సానుకూల సూచనలు చేశారన్నారు.

సనాతన ధర్మంపై విషం

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా డీఎంకే వంటి పార్టీలు మాట్లాడుతున్నాయని, అలాంటి విషం చిమ్మే వారితో కలిసి పనిచేయాల్సినంత అవసరం కాంగ్రె్‌సకు ఏముందని మోదీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ప్రతి పేజీలోనూ సనాతన ధర్మం తాలూకు చిత్రాలను ముద్రించారని, రాజ్యాంగం ప్రకారమే సనాతన ధర్మం ప్రభుత్వంలో భాగమని చెప్పారు. ఉత్తర దక్షిణ భారతాల మధ్య అగాధం ఏమీ లేదని, భారతదేశాన్ని వేర్వేరు ప్రాంతాలుగా చూడటం తెలివిమాలిన పని అని మోదీ దుయ్యబట్టారు.

భారతదేశంలో అత్యధిక గ్రామాలు శ్రీరాముడి పేరుతో ఉన్న రాష్ట్రం తమిళనాడు అన్న విషయం ఎంతమందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిలో అతి ప్రాచీన భాషగా తమిళానికి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది తానేనని గుర్తు చేశారు. డీఎంకే పట్ల ప్రజల వ్యతిరేకత బీజేపీకి సానుకూలంగా మారుతుందన్నారు.

తాను వివిధ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి సంప్రదాయాన్ని అనుసరించి దుస్తులు ధరిస్తే కూడా ప్రతిపక్షాలు తనపై విమర్శలు గుప్పించాయని, తన మీద వాటికి ఉన్న ద్వేషాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. దేశంలోని ప్రతీ ప్రాంతం తనకు ముఖ్యం కాబట్టే, జీ 20 సదస్సు సమావేశాల్ని ఢిల్లీకే పరిమితం చేయలేదని, ప్రతీ రాష్ట్రంలో వాటిని జరిపామని గుర్తు చేశారు.

సమావేశాల్లో ప్రపంచ దేశాధినేతలందరినీ ఏకం చేశానని, డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించేలా చేశామని, ఇది మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని మోదీ తెలిపారు. రామ మందిరాన్ని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకోవడం లేదని, ప్రతిపక్షాలే ఆ పని చేశాయని మోదీ ఆరోపించారు.

మోదీనే భారత్‌.. భారత్‌ అంటే మోదీనే?

ఏఎన్‌ఐ: మా కెమెరా బృందాలు ఏ బీజేపీ సభకు, ర్యాలీకి వెళ్లి చూసినా అక్కడి బీజేపీ అభ్యర్థులు, వక్తలు మోదీ గురించే మాట్లాడుతున్నారు. గతంలో ఇందిర హయాంలో ‘ఇండియానే ఇందిర. ఇందిరానే ఇండియా’ అని కాంగ్రెస్‌ వాళ్లు చెప్పుకొన్నట్లుగా.. ఇప్పుడు ‘మోదీనే భారత్‌. భారత్‌ అంటే మోదీనే’ అనే పరిస్థితి వచ్చిందనుకోవాలా?

మోదీ: భరతమాత పుత్రుడిగా మోదీని భావిస్తున్నారని నేను అనుకుంటున్నా. మోదీ భరతమాత పుత్రుడు. ఆమెకు సేవ చేస్తున్నాడంతే!

మోదీతో ప్రజాస్వామ్యానికి ముప్పా?

ఏఎన్‌ఐ: మోదీ ఎంత శక్తిమంతుడైతే దేశంలో ప్రజాస్వామ్యానికి అంత ప్రమాదం అన్న విమర్శపై ఏమంటారు?

మోదీ: దేశంలో 6 లక్షల పంచాయతీలున్నాయి. వాటిని ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలిస్తుంటారు. ఎన్నో రాష్ట్రాలు.. ఎన్నెన్నో పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా భారతదేశంలో ఒక సుప్రీం లీడర్‌ ఆవిర్భవిస్తున్నాడని ఎవరైనా అంటే అలా అనేవారు అజ్ఞానులని నా అభిప్రాయం.

ప్రతిపక్షాలకు విశ్వసనీయత లేదు

సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతికి తమ మేనిఫెస్టో బాటలు వేస్తోందని మోదీ అన్నారు. సోమవారం కేరళలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తిరువనంతపురంలో తలపడే లెఫ్ట్‌, కాంగ్రెస్‌ తమిళనాడులోని తిరునల్వేలీలో కలిసి పోటీచేస్తున్నాయని, ఏమాత్రం విశ్వసనీయత లేని విపక్షాలను తిరస్కరించాలని ఆయన కోరారు. అవినీతి పరులంతా కూటమి కట్టి తనను అడ్డుకోవాలని చూస్తున్నారని మోదీ ఆరోపించారు.

Back To Top