బడంగ్పేట్ మున్సిపల్ సర్కిల్లో వెలుగులోకి వచ్చిన ₹150 కోట్ల భారీ అవినీతి కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు.
బడంగ్పేట్ మున్సిపల్ సర్కిల్లో వెలుగులోకి వచ్చిన ₹150 కోట్ల భారీ అవినీతి కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. డిప్యూటీ కమిషనర్‌తో పాటు పదిమంది అధికారులు సస్పెండ్ కావడం ఈ అవినీతి ఎంత విస్తృతంగా జరిగిందో స్పష్టంగా చూపిస్తోందని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. బడంగ్పేట్ బీజేపీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “ఈ అవినీతి కేవలం అధికారుల పని కాదు… దీని వెనుక రాజకీయ పెద్దల ఆశీర్వాదం ఉంది. అసలు నేరస్థులు బయటపడాలి” అని డిమాండ్ చేశారు.
గత 12 సంవత్సరాలుగా బడంగ్పేట్ నగర పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ దాకా అవినీతి నిరాటంకంగా కొనసాగుతూనే ఉందని, ఈ దోపిడీపై మొదటి నుంచి బీజేపీనే పోరాటం చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇకపై ఈ పోరాటం మరింత తీవ్రంగా ఉంటుందని, అవినీతి చేసిన ఒక్క నాయకుడినైనా వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్లు పని చేయకుండానే టెండర్లు మంజూరు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని, బాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పాత బాత్రూంలకు పైపై మరమ్మతులు చేసి రూ.40 లక్షలు మింగేశారని ఆయన ఆరోపించారు. “ఈ అవినీతి బాగోతం బయటపడటానికి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదులే కారణం. లేదంటే ఈ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉండేది” అని పేర్కొన్నారు.
ఈ కేసును సిట్ లేదా సిబిఐతో విచారణ చేయాలని, సంబంధిత రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజల డబ్బు పూర్తిగా రికవరీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

