కేరళం సీఎంగా వి.డి.సతీశన్

కేరళం
Spread the love

కేరళం పొలిటికల్ హైడ్రామాకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. హస్తం పార్టీలో ముగ్గురు ఉద్ధండుల మధ్య సాగిన ముఖ్యమంత్రి రేసులో.. చివరికి అదృష్టం వీడీ సతీశన్‌ను వరించింది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల వంటి హేమాహేమీలను కాదని, కాంగ్రెస్ హైకమాండ్ వీడీ సతీశన్ వైపు మొగ్గు చూపడానికి కారణాలేంటి..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కేరళం రాజకీయాల్లో గత పది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. సుదీర్ఘ తర్జనభర్జనల తర్వాత కేరళం కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ పరిశీలకులు దీపా దాస్ మున్షీ ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పదేళ్ల తర్వాత కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి ఎంపిక హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారింది. రేసులో ముగ్గురు ఉద్ధండులు ఉండటమే దీనికి కారణం. వీడీ సతీశన్‌తో పాటు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల సీఎం రేసులో పోటీపడ్డారు. అటు ఎమ్మెల్యేల ఓటింగ్‌లోనూ కేసీకే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఒకానొక దశలో కేసీ వేణుగోపాల్ పేరు ఖరారైందని వార్తలు వచ్చాయి. కానీ ప్రజల్లో, కార్యకర్తల్లో సతీశన్‌కు ఉన్న క్రేజ్‌ను గమనించిన హైకమాండ్ సతీశన్‌ వైపే మొగ్గు చూపింది.

ఎవరీ వి.డి. సతీశన్?

సతీశన్ 31 మే 1964న ఎర్నాకుళం ప్రాంతంలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సతీశన్, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2001 నుంచి వరుసగా పారవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2021లో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, పినరయి విజయన్ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో ప్రజల మనసు గెలుచుకున్నారు.

రాజ్యాంగ శూన్యతపై విమర్శలు

ముఖ్యమంత్రి ప్రకటనలో జాప్యం జరగడంపై బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించాయి. పది రోజులుగా రాష్ట్రంలో నాయకుడు లేకపోవడం వల్ల రాజ్యాంగ శూన్యత ఏర్పడిందని, కాంగ్రెస్ నేతల పదవీ కాంక్ష వల్ల కేరళ అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి.

సతీశన్ ముందున్న సవాళ్లు

పదేళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్‌కు, కేరళ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం పెద్ద సవాల్. గ్రూపు రాజకీయాలకు అతీతంగా పాలన సాగించడం, ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే సతీశన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పారవూర్ పులిగా పేరున్న సతీశన్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేరళను ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top