కరీంనగర్ నగరంలో కుటుంబ సభ్యులు మరణించిన సందర్భంలో కర్మకాండలు పూర్తయ్యే వరకు ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఊరట కల్పించేందుకు కర్మకాండ నిలయాలను నిర్మించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు.

ఈ నేపథ్యంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఇటీవల స్మశాన వాటికలను సందర్శించి అనువైన స్థలాలను పరిశీలించారు. మార్కండేయ నగర్, ఓల్డ్ సిటీ కేబుల్ బ్రిడ్జి, అల్కాపురి, రేకుర్తి, మంచిర్యాల రహదారి స్మశాన వాటికల సమీపంలో స్థలాలను ఎంపిక చేసి, జీ+1 భవనాల రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారు.
మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “కరీంనగర్ నలుదిక్కులా నాలుగు నిలయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఒక్కో భవనానికి రూ.50 లక్షల వ్యయం చేయాలని నిర్ణయించాం. కరెంట్, నీటి వసతి, బసకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. పేదలపై భారం పడకుండా నామమాత్రపు రుసుముతో ఆశ్రయం కల్పిస్తాం” అని తెలిపారు.
ఈ నిలయాలు అందుబాటులోకి వస్తే కిరాయి ఇండ్లలో నివసించే కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. కుటుంబ సభ్యులు మరణించిన నాటి నుండి కార్యక్రమాలు ముగిసే వరకు గరిష్టంగా 13 రోజులపాటు ఈ నిలయాల్లో ఆశ్రయం పొందే అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే స్థలాల ఎంపిక పూర్తిచేసి నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మేయర్ వెల్లడించారు.