కాంగ్రెస్ ఐడియాగా చెబుతున్న ‘సంపద పునఃపంపిణీ’ వివాదం వేడెక్కుతున్న తరుణంలో ఆ పార్టీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో బాంబు వేశారు. ‘మతఆధారిత జనగణన’ కు సిఫారసు చేయడం ద్వారా దేశ సాయుధ బలగాల్లో చీలికకు కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నించాయని అన్నారు.
విశాఖపట్నం: కాంగ్రెస్ ఐడియాగా చెబుతున్న ‘సంపద పునఃపంపిణీ’ (Wealth redistribution) వివాదం వేడెక్కుతున్న తరుణంలో ఆ పార్టీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మరో బాంబు వేశారు. ‘మతఆధారిత జనగణన’ (religious census)కు సిఫారసు చేయడం ద్వారా దేశ సాయుధ బలగాల్లో (Armed forces) చీలికకు కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నించాయని విశాఖపట్నంలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఆరోపించారు.
”కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ సాయుధ బలగాల్లో మత ఆధారిత జనగణనకు 2006లో సిఫారసు చేసింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే మతపరంగా మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో సంకేతాలిచ్చింది. రెలిజియస్ మైనారిటీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టి, సాయుధ బలగాల్లో మతఆధారిత కులగణన కూడా చేపడితే దేశ ఐక్యత, సమగ్రతకు ఎంతమాత్రం మంచిది కాదు” అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తనకు సమార్ కమిటీ నివేదికను గుర్తుతెచ్చి ఆవేదనను కలిగించిందని అన్నారు.

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను రాజ్‌నాథ్ సింగ్ తప్పుపడుతూ, దొడ్డిదారిన మతఆధారిత రిజర్వేషన్లు తెచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు సమాజాన్ని విడగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. ఇదే పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించిందని, అసలు బుజ్జగింపు రాజకీయాలనేవి ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉన్నాయని రాజ్‌నాథ్ ధ్వజమెత్తారు.
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో…
గతంలోని అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ‘కమ్యూనిటీ లేబొరేటరీ’ని ఏర్పాటు చేసిందని ఆయన విమర్శించారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ కోసం ఐదుసార్లు ప్రయత్నాలు చేసిందని, అయితా వారి ఎజెండా ముందుకు సాగకుండా సుప్రీంకోర్టు, ఈ దేశంలోని చట్టాలు నిలువరించాయని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.