రిజర్వేషన్లపై యుద్ధంగా మొదలై..

రిజర్వేషన్ల
Spread the love

బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్న ప్రస్తుత పరిణామాలకు ‘ముక్తియోధుల కోటా’పై ఆగ్రహమేనా? అంటే.. రిజర్వేషన్ల అంశం పైకి కనిపించే స్థూల కారణం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు!

  • 1972లో అమల్లోకి స్వాతంత్య్ర సమరయోధుల కోటా
  • తదుపరితరాలకూ వర్తింపజేయడంపై విద్యార్థుల ఆక్రోశం

బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్న ప్రస్తుత పరిణామాలకు ‘ముక్తియోధుల కోటా’పై ఆగ్రహమేనా? అంటే.. రిజర్వేషన్ల అంశం పైకి కనిపించే స్థూల కారణం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు! బంగ్లాదేశ్‌ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు ఉద్యోగాల రూపంలో ప్రజలకు అందకపోవడం, 2009 నుంచి అధికారంలో ఉన్న అవామీ లీగ్‌ అక్రమాలు, అవినీతి, విపక్ష నేతల అరెస్టులు, ప్రతిపక్షాలు ఎన్నికలనే బహిష్కరించే పరిస్థితి రావడం.. ఇలా చాలా కారణాలు ఒకదానికొకటి తోడై ప్రస్తుత సంక్షోభానికి దారితీశాయని వారు విశ్లేషిస్తున్నారు.

1971 యుద్ధంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనంతరం.. బంగ్లాదేశ్‌ తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ 1972లో స్వాతంత్య్ర సమరయోధులకు (30%), యుద్ధం వల్ల నష్టపోయిన మహిళలకు (20%), పేదలు, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి, గిరిజనులు, మైనారిటీలకు (30%) ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కేటాయించారు. ఆయన మరణానంతరం.. ఆ దేశ ప్రభుత్వం 1976లో రిజర్వేషన్లను 60 శాతానికి తగ్గించింది.

మిగతా 40 శాతం ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయడం మొదలుపెట్టింది. 1996 నాటికి రిజర్వేషన్లు 55 శాతానికి తగ్గాయి. అయితే, 1997 తర్వాత స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో ఉద్యోగాల భర్తీ క్రమంగా తగ్గడం మొదలైంది. ఆ తరం వారంతా వృద్ధులై చనిపోవడమే ఇందుకు కారణం. దీంతో అప్పటి షేక్‌ హసీనా ప్రభుత్వం ఆ కోటాను స్వాతంత్య్ర సమర యోదుల పిల్లలకు వర్తింపజేయడం మొదలుపెట్టింది.

రిజర్వేషన్ల
రిజర్వేషన్ల

2010లో స్వాతంత్య్ర సమరయోధుల మనవలకు సైతం ఆ కోటా వర్తించేలా చేశారు. 2012లో దివ్యాంగులకు 1 శాతం కోటాను వర్తింపజేశారు. దీంతో మళ్లీ రిజర్వేషన్లు 56 శాతానికి పెరిగాయి. 2018లో ఈ కోటా వ్యవస్థను నిరసిస్తూ బంగ్లాదేశ్‌వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో.. హసీనా సర్కారు ప్రథమ, ద్వితీయ శ్రేణి ఉద్యోగాల్లో అన్ని రకాల రిజర్వేషన్లనూ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై స్వాతంత్య్ర సమరయోధుల వారసులు కొందరు 2021లో హైకోర్టును ఆశ్రయించారు.

రిజర్వేషన్లు ఎత్తేస్తూ హసీనా సర్కారు ఇచ్చిన సర్క్యులర్‌ చెల్లదంటూ ఈ ఏడాది జూలై 1న హైకోర్టు తీర్పునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూలై 14న.. నిరసనకారులను ఉగ్రవాదులతో పోలుస్తూ హసీనా చేసిన వ్యాఖ్యలు, ‘రిజర్వేషన్లు స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు కాక రజాకార్ల వారసులకు ఇవ్వాలా?’ అని వ్యంగంగా ప్రశ్నించడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. ‘అవును మేం రజాకార్లమే.. అన్యాయాన్ని ప్రశ్నించినవారు రజాకార్లయితే.. మేం రజాకార్లమే’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనల జోరు పెంచారు.

ఆ సమయంలో సున్నితంగా వ్యవహరించి విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన హసీనా సర్కారు.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూ విధించి.. సాయుధ బలగాలను రంగంలోకి దించింది. జూలై 18న.. సాయుధబలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు.

వేలాది మంది గాయపడ్డారు. జూలై 21న.. ముక్తియోధుల వారసులకు ఇస్తున్న 30 శాతం కోటాను 5 శాతానికి, దివ్యాంగుల కోటాను ఒక శాతానికి, మైనారిటీలకు, ట్రాన్స్‌జెండర్లకు కలిపి ఇస్తున్న రిజర్వేషన్‌ను ఒక శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు అప్పిలేట్‌ డివిజన్‌ తీర్పునిచ్చింది. మిగతా 93 శాతం ఉద్యోగాలనూ ప్రతిభ ఆధారంగా భర్తీ చేయడానికి మార్గం సుగమం చేసింది. కానీ, ఈ కోటాలను భవిష్యత్తులో మార్చే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుందని తన తీర్పులో పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, అప్పటికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది.

పాక్‌ హస్తం?

బంగ్లాదేశ్‌ కల్లోలం వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థి ఆందోళనలకు మద్దతిచ్చిన నిషేధిత జమాతే ఇస్లామీకి చెందిన విద్యార్థి సంఘం ‘ఛాత్ర శిబిర్‌’కు పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ అండ ఉందని.. విద్యార్థి ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చడం వెనుక అది కీలక పాత్ర పోషించిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశానికి అనుకూలంగా ఉండే హసీనా ప్రభుత్వాన్ని కూల్చి వారి లక్ష్యమని వివరించాయి.

హసీనా హయాంలో అభివృద్ధి

విద్యార్థుల ఉద్యమానికి సామాజిక, ఆర్థిక కోణాలూ ఉన్నాయి. గడిచిన దశాబ్దన్నర కాలంలో.. అంటే, షేక్‌ హసీనా 2009లో మళ్లీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ బంగ్లాదేశ్‌ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అతిపెద్ద రెడీమేడ్‌ దుస్తుల తయారీ హబ్‌గా మారి అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లకు వస్త్రాలను ఎగుమతి చేసింది. ఆ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలున్నా.. అవి ప్రైవేటు ఉద్యోగాలు. వేతనం తక్కువ. చాకిరీ ఎక్కువ.

సముచిత వేతనాలు వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలనేమో.. స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద అధికార అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు కేటాయించడం, విపరీతమైన అవినీతి కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం ప్రజల్లో కోపానికి కారణమైంది. ఆ కోపాన్ని వెలిబుచ్చుదామంటే విపరీతమైన నిర్బంధాలు. నిరసన కూడా తెలపలేని భయానకమైన వాతావరణం నెలకొని ఉండేది. ఈ పదిహేనేళ్లలో ప్రభుత్వాన్ని విమర్శించిన 80 మంది ఆచూకీ గల్లంతైంది. వారి గురించి వారి కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారమూ లేదు.

ప్రభుత్వమే వారిని చంపించిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు.. హసీనా అధికారంలో ఉండగా ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయన్న నమ్మకం లేక.. విపక్ష బీఎన్‌పీ, మరికొన్ని పార్టీలు 2014, 2024 ఎన్నికలను బాయ్‌కాట్‌ చేశాయి. ఆమె రాజీనామా చేసి.. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపిస్తేనే తాము పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇవన్నీ ప్రజల్లో కోపం తారస్థాయికి చేరడానికి కారణమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top