లేఅవుట్ల అనుమతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన లేఅవుట్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దరఖాస్తులను 21 రోజుల్లో పరిష్కరించాలని, సైట్ వైస్ విజిట్ చేసి లైటింగ్, రోడ్లు, నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.
జీవో నెంబర్ 105పై దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాలని, అవసరమైతే సంయుక్త సర్వే చేయాలని తెలిపారు. డ్రాఫ్ట్ లేఅవుట్లో పొందుపరిచిన సౌకర్యాలు ఫైనల్ లేఅవుట్లో లేకపోతే డెవలపర్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
పది ఎకరాల వరకు కలెక్టర్ అనుమతులు మంజూరు చేస్తారని, అంతకంటే ఎక్కువైతే హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అనుమతులు జారీ చేస్తారని వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీటీసీవో ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

