పేదలకో న్యాయం… ధనవంతులకో న్యాయమా? ….కరీంనగర్‌లో మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు.
కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ ప్రభుత్వం, స్థానిక అధికారులపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెరువుల్లో అనుమతులు లేకుండా నీటి ట్యాంకులు నిర్మించటం, పేదలపై మాత్రమే నిబంధనలు పెట్టి ధనవంతులకు, అధికార వర్గాలకు మినహాయింపులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.
అమృత్ టెండర్ల పేరిట జిల్లాలో 145 కోట్ల విలువైన పనులు కొందరికే కట్టబెట్టారని, రెండు భారీ నీటి ట్యాంకులను సీతారాంపూర్ చెరువులోనే నిర్మిస్తున్నారని ఆరోపించారు. సాధారణ ప్రజలకు 200 మీటర్ల దూరం పాటించాలని నోటీసులు జారీ చేస్తూ, ప్రభుత్వమే తన నిర్మాణాలను చెరువుల్లో కొనసాగించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అనుమతులతోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయా లేక కాంట్రాక్టర్ల స్వేచ్ఛతోనా అన్న విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చెరువుల పరిసర భూములు వందల కోట్లు విలువ చేస్తాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.
పద్మనగర్‌లో విద్యుత్ పనుల పేరిట కూడా అనుమతులు లేకుండా కట్టడాలు జరుగుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలు, కూలీలపై మాత్రమే నోటీసులు జారీ చేస్తూ, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ నివాసాలపై ఏ చర్యలు తీసుకోకపోవడం అన్యాయం అని వ్యాఖ్యానించారు.
అమృత్ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు, అనుమతులు బయటపెట్టకపోతే హైకోర్టును ఆశ్రయించి, ట్రెస్‌పాస్ కింద కేసులు వేస్తామని హెచ్చరించారు. పేదల హక్కుల కోసం తాను వెనకడుగు వేయనని, బలహీనులపై అన్యాయం జరిగితే ఊరుకోబోనని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు.