మాతృ సంస్థ రుణం తీర్చుకునేందుకు కదలిరండి
అకడమిక్ – పరిశ్రమ అవసరాల అంతరాన్ని తొలగించాలి
స్కిల్ సెన్సస్ తో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కృషి
ఎఐ అవకాశాలను అందిపుచ్చుకునేలా పాఠ్యాంశాల రూపకల్పన
ఆంధ్రా యూనివర్సిటీ పూర్వవైభవానికి సహకరించండి
ఎయు అల్యుమిని మీట్ లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
విశాఖపట్నం: రాబోయే రోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీ గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్ – 3, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమిని మీట్ ను ఎయు కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఆంధ్ర యూనివర్శిటీని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని అన్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ గౌరవ అతిధిగా హాజరుకాగా. ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, జిఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్ వి ఆదినారాయణరావు తరఫున ఆయన సతీమణి శశిప్రభ హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రా యూనివర్సిటీ అంతర్జాతీయస్థాయి విద్యా సంస్థగా ఆవిర్భవించాలన్న తన కోరిక జోక్ లేదా మ్యాజిక్ కాదు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రత్యేకించి పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తల సమిష్టి కృషితో భవిష్యత్తులో ఎయు ప్రపంచస్థాయి విద్యాసంస్థగా ఆవిర్భవించడం సాధ్యమే. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాల్లో ఎయు పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేసిన బలమైన పునాదికి నిదర్శనం. ఇప్పుడు మీరంతా మాతృ సంస్థ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఎయు నుంచి ఎందరో ప్రముఖులు
ప్రస్తుత విద్యార్థుల ఉన్నతికి మీ మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త సిఆర్ రావు, యుజిసి మాజీ వైస్ చైర్మన్ బిఆర్ రావు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, జిఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నీలి బెండపూడి, బివిఆర్ మోహన్ రెడ్డి, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ సగ్గుర్తి వంటిప్రముఖులు సాధించిన విజయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయ వారసత్వానికి నిదర్శనం. ఖండాంతర ఖ్యాతి సాధించిన ఎయు ఆల్యూమిని ప్రముఖులను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. దాదాపు ఒక శతాబ్ద కాలంగా విజ్ఞాన దీవిగా, అధునాతన ఆవిష్కరణల నిలయంగా, అసంఖ్యాకమైన మేధావుల కలల వారధిగా ఎయు కొలువై ఉంది. 1926లో 434 ఎకరాల సువిశాలమైన క్యాంపస్‌లో స్థాపించాక నైపుణ్యతతో కూడిన విద్యాలయంగా వెలుగు వెలిగింది. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మందికి అత్యుత్తమ విద్యనందించి మేథోవంతమైన సమాజాన్ని తయారుచేయడంలో కీలకపాత్ర వహిస్తూ సరస్వతీ నిలయంగా వెలుగొందుతోంది.
మెరుగైన ఎకోసిస్టమ్ కోసం ప్రత్యేక వేదిక
అల్యూమిని ప్రముఖుల వృత్తిపరమైన, వ్యక్తిగత అనుభవాలు, మార్గదర్శకత్వం, ప్రగతిశీల ఆలోచనలు ప్రస్తుత విద్యార్థులు, యువత కెరీర్ ను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడతాయి. మీరంతా సలహాదారులుగా మారడం ద్వారా ప్రస్తుత విద్యార్థుల కలలు సాకారానికి ఆలంబనగా నిలవాలి. ఉన్నతవిద్యలో మెరుగైన ఎకోసిస్టమ్ నిర్మించడానికి పూర్వవిద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక వేదిక ఏర్పాటుచేస్తాం. నేడు అంతర్జాతీయంగా ట్రెండింగ్ లో ఉన్న కృత్రిమ మేథ (ఎఐ)ని అందిపుచ్చుకోవడంలో ఇండస్ట్రీ కనెక్ట్ కీలక పాత్ర వహిస్తుంది. వివిధ కీలక స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు అకడమిక్, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కృషిచేయాలని కోరుతున్నాను. మీ నెట్‌వర్క్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లు, వాస్తవ ప్రపంచ అవసరాలను గుర్తించడానికి మార్గం సుగమం చేస్తుంది. దీనిద్వారా ఇక్కడ విద్యనభ్యసించిన గ్రాడ్యుయేట్ల ఉపాధిని పెంపొందించడమే కాకుండా యూనివర్సిటీ ప్రమాణాలు మెరుగవుతాయి.
అల్యూమిని ప్రముఖులు ముందుకురావాలి
ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా ప్రపంచానికి ఎనలేని సేవలను అందించినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఇటీవల సంవత్సరాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నది కాదనలేని సత్యం. NIRF యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2019లో 16గా ఉండగా, 2024లో 25కి క్షీణించింది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఇది 29వ స్థానం నుండి 41వ స్థానానికి పడిపోయింది. ఈ చేదునిజాన్ని అందరూ గమనించాల్సి ఉంది. యూనివర్సిటీకి గత వైభవాన్ని పునర్నిర్మించడానికి నేటి సమావేశం కీలకమైన అడుగుగా నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇందుకోసం అల్యూమిని ప్రముఖులంతా దృడమైన సంకల్పంతో ముందుకురావాలని కోరుతున్నాను. అధునాతన ఆవిష్కరణలు, పరిశోధనల కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీని ముందువరుసలో నిలిపేందుకు మీ వంతు సహాయ, సహకారాలు అందించండి.
ఎయు పూర్వవైభవానికి కట్టుబడి ఉన్నాం
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గత వైభవాన్ని చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. విద్యాప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, పాఠ్యాంశాలను ఆధునీకరించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు జరుగుతున్నాయి. దీనిద్వారా ఇక్కడి విద్యార్థులు అగ్రశ్రేణి అధ్యాపకులచే మార్గదర్శకత్వం పొందుతారు. విద్యాశాఖ మంత్రిగా KG నుండి PG వరకు సమూల ప్రక్షాళనకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడంతోపాటు ఉపాధ్యాయులు పూర్తిగా విద్యాబోధనపైనే దృష్టి సారించడానికి వీలుగా బోధనేతర పనులకు అధ్యాపకులను దూరంగా ఉంచుతున్నాం. యూనివర్శిటీల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ భర్తీకి చర్యలు చేపడుతున్నాం. ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి అందుబాటులో ఉన్న నిధులను వినియోగిస్తున్నాం. ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీతో ఎయు గ్లోబల్ ఇంక్యుబేషన్ హబ్‌గా మార్చడానికి ఆంధ్రా యూనివర్సిటీలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
నైపుణ్యాల మెరుగుదలకు స్కిల్ సెన్సస్
ఇప్పటివరకు ఉన్నత విద్యా వ్యవస్థలో లోపాల కారణంగా గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివిన విద్యార్థులను ఉద్యోగానికి సిద్ధం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిన మాట వాస్తవం. అమీర్‌పేట్‌లోని ఇతర చోట్ల శిక్షణా కేంద్రాల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు 3-4 నెలల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. నాలుగేళ్లు ఉన్నత విద్య అభ్యసించిన వారు ఎందుకు ఆవిధంగా తయారుకాలేక పోతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు AP ప్రభుత్వం స్కిల్ సెన్సస్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో పౌరులందరి నైపుణ్యాలతో కూడిన ప్రొఫైల్స్ ను క్రోడికరించి, నైపుణ్య అంతరాలను గుర్తిస్తారు. ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం, రీస్కిల్లింగ్ కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరి ప్రొఫైల్‌లు (APAAR IDలు) వారి అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తాం. వారికి అవసరమైన శిక్షణ కోసం మెంటార్ పరిశ్రమకు కనెక్ట్ చేసి ఉద్యోగానికి సిద్ధం చేస్తాం.
ఎపి మోడల్ ఎడ్యుకేషన్ కు కృషి
ఎఐ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించి, మెరుగైన సామర్థ్యాలతో గ్రాడ్యుయేట్లను తయారుచేయడమే మా లక్ష్యం. ఇందుకోసం KG నుండి PG పాఠ్యాంశాలను ప్రక్షాళన చేసి ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెచ్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషిచేస్తున్నాం. ఇదే సమయంలో మానవత్వం, నైతికత, మహిళలపై గౌరవం వంటి అంశాలను కూడా జోడించి సరికొత్త విద్యాబోధనకు శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు, సామాజిక శాస్త్రవేత్తలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్‌లను, ఉత్తమ రాజకీయవేత్తలను తయారుచేసే కర్మాగారంగా ఆంధ్రా యూనివర్సిటీని తీర్చిదిద్దాలన్న మా సంకల్పానికి మీ వంతు సహకారం అందించండి. అందరం కలసి ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుదాం. ఈ మహోన్నత లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రా వర్సిటీ కీర్తిప్రతిష్టలను పునరుద్దరించే యజ్ఞంలో మేము సైతం అంటూ ముందుకు రావాలని మంత్రి లోకేష్ అల్యూమిని ప్రముఖులకు పిలుపునిచ్చారు.