కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిబండి సంజయ్ హెచ్చరించారు. ఎవరైనా తన పేరు చెప్పుకుని అక్రమ దందాలు చేస్తూ పంచాయతీలు, సెటిల్మెంట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
ఈ మేరకు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పలు సూచనలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొంతమంది తన పేరు ఉపయోగించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అలాంటి వ్యక్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు.
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి పైరవీకారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలకు సేవ చేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకువచ్చే వారిని ప్రోత్సహిస్తానని, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇకపై తన పేరు చెప్పి ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎంపీ కార్యాలయ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

