కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకోణాన్ని అధికారులు వెలికితీశారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకోణాన్ని అధికారులు వెలికితీశారు. సుమారు రూ.1,40,18,308/- మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచారణలో తేలింది.
గతంలో పే-సెక్షన్‌లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి, మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో ఇతరుల పేర్లను చేర్చాడు. నిందితుడు ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించడం ద్వారా 2022 నుండి 2026 వరకు ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందాడు.
అక్రమంగా వచ్చిన సొమ్ముతో వ్యక్తిగత లోన్లు పొందడమే కాకుండా, నగదును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటనపై కరీంనగర్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు బాధ్యుడైన పోలీసు ఉద్యోగిపై కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు తెలిపారు.
ఇంకా ఎవరెవరికి ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు అంతర్గత విచారణ కొనసాగుతోందని, పూర్తి విచారణ అనంతరం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.

