వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ వినియోగం అధికమవడం, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా అగ్ని ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతుందని కరీంనగర్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
కరీంనగర్, మే 3:
వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ వినియోగం అధికమవడం, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా అగ్ని ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతుందని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా భారీ నష్టం, ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందన్నారు.
వేసవి కాలంలో ముఖ్యంగా పొలాల్లో కోసిన గడ్డి, ఎండిన పంట అవశేషాలు, చెట్ల పొదలు, ఖాళీ ప్రదేశాల్లో నిల్వ ఉంచిన మండే పదార్థాలు సులభంగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. గాలి వేగంగా వీచే సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీప గృహాలు, షెడ్లు, వాహనాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందన్నారు. రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్త అవసరం
వేసవిలో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు, మోటార్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడంతో విద్యుత్ వైర్లు వేడెక్కడం, షార్ట్ సర్క్యూట్‌లు సంభవించే ముప్పు ఉంటుందని తెలిపారు. నాసిరకం వైర్లు, పాత స్విచ్ బోర్డులు, అధిక లోడ్‌తో మల్టీప్లగ్‌లు ఉపయోగించడం ప్రమాదకరమన్నారు. ఇళ్లలో, దుకాణాల్లో, కార్యాలయాల్లో ఎలక్ట్రికల్ వ్యవస్థలను కాలానుగుణంగా తనిఖీ చేయించుకోవాలని సూచించారు.
అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల్లో మరింత అప్రమత్తత
ఇటీవల పలు అపార్ట్‌మెంట్లు, మాల్స్, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బహుళ అంతస్తుల భవనాల యాజమాన్యాలు అగ్ని భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఫైర్ అలారమ్ వ్యవస్థలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. మెట్ల మార్గాలు, కారిడార్లలో వస్తువులు నిల్వ ఉంచకూడదన్నారు.
అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలు
గత నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని మాల్స్, హాస్పిటళ్లు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఎలా బయటపడాలి, ప్రాథమిక అగ్నిమాపక పరికరాలు ఎలా వినియోగించాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.
ప్రజలకు సూచనలు
ఇళ్లలో గ్యాస్ పైపులు, రెగ్యులేటర్లను నిర్దిష్ట కాల వ్యవధిలో మార్చుకోవాలి. వంట గదిలో మంట వెలిగించి వదిలేయరాదు. పిల్లలను గ్యాస్ స్టౌ, ఎలక్ట్రిక్ పరికరాల దగ్గర ఒంటరిగా ఉంచకూడదు. వాహనాలను సమయానుకూలంగా సర్వీసింగ్ చేయించుకోవడంతో పాటు రేడియేటర్, టైర్ల పరిస్థితి పరిశీలించుకోవాలి. సెలార్లలో మండే పదార్థాలు నిల్వ చేయరాదని, విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 నంబర్‌కు సమాచారం అందించి అగ్నిమాపక శాఖ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ప్రజల సహకారం, అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

