Site icon Chaithanya Galam News

నేడే శ్రీ మహాశక్తి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం

మహాశక్తి

మహాశక్తి

Spread the love

పడి పూజకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం,కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ. పడిపూజ మహోత్సవంలో పాల్గొననున్న కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్.

కరీంనగర్ లోని ముగ్గురు అమ్మవార్లు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతిల మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో నేడు (శనివారం) సాయంత్రం 6 గంటలకు చేపట్టే శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవ వేడుకల కోసం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి దివ్య ఆశీస్సులతో పడిపూజ కార్యక్రమాన్ని కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

పడిపూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొననున్నారు. పూజ అనంతరం స్వాములకు, వచ్చే భక్తుల కోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అల్పాహారం ఏర్పాటు చేశారు. పడి పూజ నిర్వహించేందుకు దేవాలయంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి పూలతో వైభవంగా అలంకరించారు. ఆలయాన్ని మరియు పరిసరాలను కూడా వివిధ పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.


మొదటగా వాస్తు పూజ, గణపతి, సుబ్రహ్మణ్య మరియు తదితర దేవత షోడశోపచార పూజ, అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ట, పడి పూజ, అయ్యప్ప స్వామికి అభిషేకం, మంత్రపుష్పం తదితర క్రతువులతో పూజలు నిర్వహించనున్నారు.
స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

కావేటి పరమేశ్వర్ గురుస్వామి పడిపూజకు ఎంతో ప్రత్యేకత….

36వ శబరిమల యాత్ర చేస్తున్న సందర్భంగా పరమేశ్వర్ గురుస్వామి గురించి….

ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప దీక్షలో ఎంతోమందికి మాల వేయించి, దీక్షకు సంబంధించిన నియమాలు, సందేహాలను నివృత్తి చేసే విషయంలో కావేటి పరమేశ్వర్ గురుస్వామికి ఎంతో గుర్తింపు ఉంది. భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి, ఉన్నత స్థితికి చేర్చడంలో కావేటి పరమేశ్వర్ గురుస్వామి కీలక పాత్ర పోషించడంతో, అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు పరమేశ్వర్ గురుస్వామిని దైవ సమానులుగా భావిస్తుంటారు. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష, సమస్త భక్తజనుల ప్రయోజనాల కోసం చేస్తున్న కృషికి జాతీయస్థాయిలో గుర్తింపు పొంది, ఇటీవలే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ 2025 సంవత్సరంకుగాను తెలంగాణ రాష్ట్రం నుండి పరమేశ్వర్ స్వామిని ఎంపికచేసి కాంచీపురంలో “అయ్యప్ప సేవ రత్న” అవార్డు ను కూడా అందించారు.

కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టే పడిపూజకు ఎంతో ప్రాధాన్యత, విశిష్టత, నిష్ఠ, సమయపాలన, క్రమశిక్షణ ఉంటుంది. పూజచేసిన, ఇరుముడికట్టిన ఎలాంటి దక్షిణ తీసుకోకుండా 36 సంవత్సరాలుగా ఉచితంగానే సేవ చేయడం విశేషం. పేద, ధనిక భేదాలు లేకుండా ఏ స్వామి పిలిచినా తమ ఇంటికెళ్లి పూజ, భజన కార్యక్రమాలు చేస్తూ సేవ చేస్తుంటారు.
వృత్తిరీత్యా విశ్రాంత ఉపాధ్యాయుడు అయినా పరమేశ్వర స్వామి టీచర్ గా ఉన్న సమయంలో కూడా అటు స్కూలుకు, ఇటూ విద్యార్థులకు కూడా విద్యా బోధనలు నేర్పుతూ తనకు తోచిన విధంగా సేవ చేస్తూ వచ్చారు.పేద విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తలచి పాఠశాలలకు తన మిత్రబృందం ద్వారా బెంచీలు, ఆర్వో ప్లాంట్, ప్రొజెక్టర్లు, అలాగే విద్యార్థులకు నోటు బుక్స్, టెక్స్ట్ బుక్స్ గైడ్స్, పెన్నులు కూడా అందించారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఉదయం మరియు సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా టిఫిన్లు మరియు స్నాక్స్ కూడా అందించి వారిని ప్రోత్సహించారు.

అయ్యప్ప సేవా సమితి ఏర్పాటు చేసి ఎన్నో వేల పడిపూజలు భజనలు చేస్తూ అయ్యప్ప గురుస్వామిలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నూతనంగా అయ్యప్ప మాల వేసుకొని కన్నె స్వాములకే కాకుండా వివిధ అయ్యప్ప భక్తులకు కూడా ఆదర్శంగా నిలిచారు. గతంలో అయ్యప్ప స్వామిని మరియు దీక్షాపరులను కించపరిచినప్పుడు కూడా అనేక నిరసన కార్యక్రమాలను కూడా స్వాములందరితో కలిసి నిర్వహించారు. కరీంనగర్ అయ్యప్ప దేవాలయంలో కూడా అయ్యప్ప స్వామికి లక్ష దీపార్చన, సహస్ర ఘటాభిషేకం, అయ్యప్ప స్వామి సప్తాహ నామస్మరణం లాంటి తదితర కార్యక్రమాలను అయ్యప్ప స్వామి దీక్ష పరుల సహాయ సహకారాలతో నిర్వహించారు. ఈ సంవత్సరం 36వ శబరిమల యాత్ర చేస్తున్నటువంటి పరమేశ్వర్ గురుస్వామి యావత్ అయ్యప్ప స్వాములకు ఆదర్శంగా నిలుస్తారు.

Exit mobile version