Site icon Chaithanya Galam News

కరీంనగర్ చెరువుల సుందరీకరణకు శ్రీకారం

కర్మకాండ

కర్మకాండ

Spread the love

కరీంనగర్ కొత్తపల్లి, రేకుర్తి, తీగలగుట్టపల్లి చెరువులకు నూతన రూపు.ఈ నెల నాలుగో వారంలో పనులకు శ్రీకారం చుట్టనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుల సుందరీకరణకు పెద్దఎత్తున చర్యలు ప్రారంభమయ్యాయి. రేకుర్తి, తీగలగుట్టపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లోని చెరువులను అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దేందుకు మొత్తం రూ.5.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అమృత్ 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.

టెండర్ ప్రక్రియ పూర్తవడంతో, ఈ నెల నాలుగో వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఇప్పటికే ఆయనను కలిసి పనులను ప్రారంభించాలని కోరగా, పార్లమెంట్ సమావేశాల అనంతరం హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు.

కొత్తపల్లి చెరువుకు రూ.2.86 కోట్లు

కొత్తపల్లి మున్సిపాలిటీలోని ఊర చెరువు అభివృద్ధికి రూ.2.86 కోట్లు కేటాయించారు. చెరువు కట్ట బలోపేతం, రక్షణ చర్యలు, కాలుష్య నియంత్రణ, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. అసలు పనుల వ్యయం రూ.2.25 కోట్లుగా అంచనా వేయగా, పన్నులు, సెస్సులు, కన్సల్టెన్సీ తదితర ఖర్చులతో మొత్తం వ్యయం రూ.2.86 కోట్లకు చేరింది.

తీగలగుట్టపల్లి చెరువుకు రూ.1.10 కోట్లు

తీగలగుట్టపల్లి మాల కుంట చెరువు పునరుద్ధరణకు రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. చెరువు బండ్ బలోపేతం, స్టోన్ పిచింగ్, ఫిల్టర్ మీడియా, డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ఎంఎస్ రైలింగ్, చైన్ లింక్ మెష్ వంటి రక్షణ చర్యలతో పాటు పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపడతారు. పనుల కోసం రూ.85.35 లక్షలు, ఇతర ఖర్చుల కోసం రూ.24.64 లక్షలు కేటాయించారు.

రేకుర్తి చెరువుకు రూ.1.80 కోట్లు

రేకుర్తి పెంటకమ్మ చెరువు అభివృద్ధికి రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. చెరువు పరిసరాల్లో పచ్చదనం పెంపుతో పాటు నీటి నిల్వను కాపాడేందుకు ఆర్‌సీసీ ఓపెన్ డ్రెయిన్ నిర్మాణం చేపడతారు. పనుల వ్యయం రూ.1.36 కోట్లుగా ఉండగా, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.1.80 కోట్లకు చేరింది.

నీటి నిల్వతో పాటు అందం పెరుగుతుంది

ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత చెరువులు కేవలం అందంగా మారడమే కాకుండా నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించడంలో ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి.

Exit mobile version