Site icon Chaithanya Galam News

పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

ముఠా

ముఠా

Spread the love

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్‌లో మే 3న జరిగిన భారీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్‌లో మే 3న జరిగిన భారీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు కలిపి రూ.82 లక్షల 2 వేల విలువైన ఆభరణాలు దోచుకెళ్లగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

ఈ ఆపరేషన్‌ను ప్రస్తుతం బీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ హ్యాండ్లర్, “ది గోల్డెన్ థీఫ్”గా పేరొందిన సుభోద్ సింగ్ ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్ను మే 13న వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు రవీష్ కుమార్ @ ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తీసుకువచ్చారు.

విచారణలో ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నంబర్ ప్లేట్లు, తప్పుడు పేర్లతో లాడ్జ్‌లలో బస చేయడం, ఆధునిక సాంకేతికత వినియోగించడం వంటి పద్ధతులతో ఆయుధాలతో దోపిడీలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

దోపిడీ రోజున నిందితులు ధర్మపురిలో లాడ్జ్ ఖాళీ చేసి, బైక్ నంబర్ ప్లేట్లు మార్చి, వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద ప్రణాళికను మరోసారి చర్చించి, ఉదయం 10:50 గంటలకు షాప్‌లోకి ప్రవేశించారు. సిబ్బంది ప్రతిఘటించడంతో ఆయుధాలతో కాల్పులు జరిపి, ఒక ఆభరణాల బ్యాగ్‌తో పారిపోయారు. మరో బ్యాగ్‌ను షాప్‌లో వదిలివెళ్లారు.

సాంకేతిక నిఘా ఆధారంగా ఇప్పటివరకు 13 మంది నిందితులను గుర్తించగా, ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.51,000 నగదు, మొబైల్ ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

కరీంనగర్ పోలీసులు బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, లాడ్జ్‌లు, గెస్ట్ హౌస్ యజమానులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అప్రమత్తంగా ఉంచడం, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వడం, సరైన ఐడీ ధృవీకరణ తర్వాత మాత్రమే గదులు ఇవ్వడం, నగదు–బంగారం రవాణా సమయంలో భద్రతా నియమాలు పాటించడం, ఎమర్జెన్సీ అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version