భారతదేశ ధర్మ పరిరక్షణకు నిలువెత్తు చిహ్నమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు.
భారతదేశ ధర్మ పరిరక్షణకు నిలువెత్తు చిహ్నమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) పేర్కొన్నారు. ధర్మ స్వేచ్ఛ కోసం మొఘలుల నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు ఆయనని కొనియాడారు.
350వ షహీద్ దివస్ సందర్భంగా శ్రీ గురు తెగ్ బహదూర్ మహారాజ్ విశాల్ కీర్తన దివస్‌లో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గురు తెగ్ బహదూర్ జీ త్యాగాన్ని స్మరించుకున్నారు.
గురు తెగ్ బహదూర్ జీ అసలు పేరు త్యాగమల్ అని, మొఘలుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల్లో ఆయన చూపిన ధైర్యసాహసాల కారణంగా ప్రజలు ఆయనను ‘తెగ్ బహదూర్’గా పిలిచారని తెలిపారు. ఆయన జీవితం ఒక వ్యక్తి గాథ కాదు, మత స్వేచ్ఛ కోసం సాగిన మహా త్యాగ చరిత్రగా బండి సంజయ్ పేర్కొన్నారు.
1660ల కాలంలో దేశమంతా బలవంతపు మత మార్పిడులు, హింసతో భయాందోళనలో ఉందని గుర్తు చేశారు. ఆ సమయంలో కశ్మీర్ పండితులు ఆనంద్‌పూర్ సాహిబ్‌లో గురు తెగ్ బహదూర్ జీని కలిసి తమ వేదనను వివరించారని, వారి రక్షణ కోసం గురువు స్వయంగా ముందుకు వచ్చారని చెప్పారు. ఔరంగజేబు ఎదుట ‘ధర్మం మారదు, తల నరికినా సరే’ అని ప్రకటించి ఆయన ప్రాణత్యాగం చేశారని వివరించారు.
ఆ ఒక్క త్యాగం భారతదేశంలో ధర్మ చైతన్యాన్ని మేల్కొలిపిందని, అందుకే దేశం ఆయనను ‘హింద్ కి చాదర్’గా గౌరవించిందని అన్నారు. గురు తెగ్ బహదూర్ జీ త్యాగమే గురు గోబింద్ సింగ్ జీ చేతుల్లో ఖాల్సా పంత్‌కు పునాదిగా మారిందని తెలిపారు.
నేటి సమాజం గురు తెగ్ బహదూర్ జీ చూపిన మార్గాన్ని అనుసరించాలని బండి సంజయ్ (Bandi Sanjay) పిలుపునిచ్చారు. అన్యాయం జరిగితే మౌనంగా ఉండకూడదని, ధర్మం కోసం నిలబడే ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని అన్నారు.
ఈ దేశం సింహాసనాలపై కాదు, త్యాగమూర్తుల రక్తంపై నిలబడి ఉందని పేర్కొన్న బండి సంజయ్, గురు తెగ్ బహదూర్ జీ బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని తెలిపారు.

