Site icon Chaithanya Galam News

ఢిల్లీలో కారు బాంబు పేలుడు… 8 మంది దుర్మరణం

కారు

కారు

Spread the love

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్
వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్
వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా పోలీసులు అలర్ట్ ప్రకటించారు. నగరంలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు గానీ, వస్తువులు గానీ కనిపిస్తే, ప్రజలు వెంటనే ‘డయల్ 100′ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీపీ సజ్జనార్ సూచించారు.

నగరం వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో, అన్ని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్లలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అదేవిధంగా, ఎంజీబీఎస్ జేబీఎస్ బస్ స్టేషన్లతో పాటు నగరంలోని పలు ఇతర బస్ స్టాండ్లలో, రద్దీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ పాతబస్తీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాడ్బన్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు భారీ ఎత్తున వాహన తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

సోమవారం సాయంత్రం (నవంబర్ 10) ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా) సమీపంలో జరిగిన ఈ భారీ పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్క్ చేసిన ఒక కారులో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ భయానక దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఎల్ఎన్ఎజెపి ఆసుపత్రికి తరలించారు. “ఇది చాలా శక్తివంతమైన పేలుడు” అని ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పేలుడు ధాటికి కారు సమీపంలో ఉన్న మరో 10 వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఘటనా స్థలం నుండి అందిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

పేలుడు ధాటికి తలుపులు ఊడిపోయిన ఒక వ్యాన్, పూర్తిగా నుజ్జునుజ్జెన మరో కారు, అద్దాలు పగిలిపోయిన వాహనాలు కనిపించాయి. నేలపై ఒక గాయపడిన వ్యక్తి పడి ఉన్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. “మేము మా ఇంటి టెర్రస్ నుండి ఒక భారీ అగ్నిగోళాన్ని చూశాం. భవనాల కిటికీలు కూడా కదిలిపోయేంత పెద్ద శబ్దం వచ్చింది” అని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

సమాచారం అందిన వెంటనే సుమారు 20 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, ట్రాఫిక్ను నిలిపివేశారు. పేలుడు స్వభావం ఇంకా తెలియరాలేదు. ఫోరెన్సిక్, సాంకేతిక నిపుణుల బృందాలు పేలుడుకు గల కారణాలను నిర్ధారించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

కాగా, ఇదే రోజు హర్యానాలోని ఫరీదాబాద్లో అద్దె ఇంట్లో సుమారు 2,900 కిలోల భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. పుల్వామాకు చెందిన ఓ డాక్టర్తో సహా, ఉన్నత విద్యావంతులైన వృత్తి నిపుణులతో నడుస్తున్న “వైట్ కాలర్” టెర్రరిస్ట్ ఎకోసిస్టమ్ను ఛేదించిన రోజే ఢిల్లీలో ఈ పేలుడు జరగడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.

Exit mobile version