కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది.
కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది. గత ఎన్నికల్లో కేవలం 22 స్థానాల్లోనే బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా, ఈసారి మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో 160 స్థానాల్లో పోటీ చేసి 40కిపైగా స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అంచనాలకు మించి విజయాలు రావడంతో కరీంనగర్(Karimnagar) కమలనాథుల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తొలిదశలో విజయం సాధించిన మరో పది మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బండి సంజయ్ సమక్షంలో బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో, కేంద్ర నిధుల ద్వారానే అభివృద్ధి సాధ్యమని వారు భావిస్తున్నారు. ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్‌తోపాటు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చి గ్రామాలకు ఉపయోగపడేలా చేస్తానని బండి సంజయ్ పలుమార్లు హామీ ఇవ్వడం వల్ల స్వతంత్రులు బీజేపీ చేరికకు ఆసక్తి చూపుతున్నారు.
పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగినా, బండి సంజయ్ అభ్యర్థులతో నిరంతరం టచ్‌లో ఉండి వారికి అన్ని రకాల సహకారం అందించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పోల్ మేనేజ్మెంట్‌పై సూచనలు చేస్తూ, చివరి నిమిషం వరకు అభ్యర్థుల పరిస్థితిని సమీక్షించారు. వాస్తవానికి తొలి దశలో 30 స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు అంచనా వేసినా, 40కిపైగా స్థానాల్లో గెలుపు సాధించడం పార్టీ శ్రేణులకు ఊపిరి పోసింది.
రాబోయే రెండో, మూడో దశల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే అధిక స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహరచన జరుగుతుండగా, తొలి దశలోనే ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలు రావడం కరీంనగర్(Karimnagar) బీజేపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.

