Site icon Chaithanya Galam News

రంగారెడ్డి జిల్లాలో 10వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం

ఆయిల్
Spread the love

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి

పత్తి, ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దు

ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్

అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

జిల్లాలో పది వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు కోసం రైతుల నుండి ఈ నెల 30 వరకు ఏఈవోల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

రంగారెడ్డి జిల్లా : జిల్లాలో పది వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు కోసం రైతుల నుండి ఈ నెల 30 వరకు ఏఈవోల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.


మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ సమావేశ మందిరం నుండి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంఈఓలు, మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏఈవోలు క్లస్టర్‌కు 200 ఎకరాల లక్ష్యంగా ఆయిల్ పామ్ సాగు కోసం రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1590 ఎకరాలు ఆయిల్ పామ్ సాగులో ఉందని, పది వేల ఎకరాలలో సాగు చేస్తే మన జిల్లాకు కంపెనీ వస్తుందని అన్నారు.


కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 21 నుండి జిల్లాలోని హాస్టల్స్, పాఠశాలలు, హాస్పిటల్స్‌లో ఎలాంటి పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి గ్రాస్ కట్టింగ్ మిషన్లను కొనుగోలు చేసి ఎలాంటి గడ్డి పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు.


తదుపరి ఆరోగ్య శాఖపై సమీక్షిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల శాతం తక్కువగా ఉన్నందున దాన్ని అధిగమించేందుకు డాక్టర్లు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. గర్భిణీలకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన మందులను అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.


ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్లో ఓపీఎమ్‌ఎస్ వివరాలు నమోదు చేసే విధంగా పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ధాన్యం తరలింపును వెంటనే చేపట్టాలని, ఏఈవోలు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version