Site icon Chaithanya Galam News

మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి

మావోయిస్టులు

మావోయిస్టులు

Spread the love

మావోయిస్టులు హింసా మార్గాన్ని పూర్తిగా వీడి, ఆయుధాలను విడిచిపెట్టి రాజ్యాంగ బాటలో నడవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా పిలుపునిచ్చారు.

రామగుండం : మావోయిస్టులు హింసా మార్గాన్ని పూర్తిగా వీడి, ఆయుధాలను విడిచిపెట్టి రాజ్యాంగ బాటలో నడవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా పిలుపునిచ్చారు. అరణ్య జీవితం, అజ్ఞాతాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వం తరఫున పూర్తి భద్రతతో పాటు పునరావాసం, ప్రోత్సాహక పథకాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ ఎదుట మొత్తం 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు కాగా, మావోయిస్టు ముఖ్య నేత శ్రీకాంత్‌తో పాటు మరో ఏడుగురు ఉన్నారని అధికారులు తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా, కొరియర్ విభాగం, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ స్థాయిలో పనిచేసినవారిగా గుర్తించినట్లు సీపీ వెల్లడించారు.

ఈ సందర్భంగా సీపీ అంబర్‌కిషోర్ ఝా మాట్లాడుతూ…
రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, హింసను సృష్టించే మార్గం చివరికి నేరస్తుల జీవితానికే దారితీస్తుందని అన్నారు. సమాజ అభివృద్ధికి అడ్డుగా నిలిచే హింసను విడిచి, శాంతియుత జీవితం వైపు అడుగులు వేయాలని సూచించారు.

లొంగిపోవాలనుకునే మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ రక్షణ కల్పిస్తామని, పునరావాస పథకాలు, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను వర్తింపజేస్తామని తెలిపారు.


“పోరు వద్దు… ఊరు ముద్దు” అనే భావనతో ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడి సాధారణ జీవన స్రవంతిలో కలవాలని సీపీ పిలుపునిచ్చారు.

Exit mobile version