వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలందరూ వడదెబ్బపై పూర్తి అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి ఒక ప్రకటనలో సూచించారు.
వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలందరూ వడదెబ్బపై పూర్తి అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి ఒక ప్రకటనలో సూచించారు. “వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదాం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఎండ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరిగి మెదడుపై ప్రభావం చూపుతుందని, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించే మెదడు కేంద్రం దెబ్బతిని హీట్‌స్ట్రోక్ లేదా సన్‌స్ట్రోక్ సంభవిస్తుందని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమై ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.వడదెబ్బ లక్షణాలుగా చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం, వణుకు పుట్టడం, మగత, కలవరింతలు, ఫిట్స్ రావడం లేదా అపస్మారక స్థితి కనిపిస్తాయని వివరించారు.
ఎండలో బయటికి వెళ్లినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యున్ని సంప్రదించాలని సూచించారు.వడదెబ్బ నివారణకు గొడుగు వాడటం, తెలుపు రంగు లేదా పలుచటి వస్త్రాలు ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు ధరించడం, వేడి గాలులు తగలకుండా జాగ్రత్తపడడం, ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆరుబయట పనులు చేయకపోవడం, ప్రయాణాలు ఉదయం పదకొండు గంటల లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల తరువాత చేయడం, ఇంటి నుండి బయలుదేరే ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం, ఎండలో తిరిగేటప్పుడు తాగునీరు వెంట తీసుకువెళ్లడం వంటి చర్యలు పాటించాలని సూచించారు.
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడగల ప్రదేశానికి తీసుకెళ్లి చల్లని నీటిలో ముంచిన తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలని, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చల్లబరుస్తూ ఉండాలని, చల్లని గాలి తగిలేలా చూడాలని తెలిపారు. డీహైడ్రేషన్ నివారణకు ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణం లేదా ఓఆర్‌ఎస్ త్రాగించవచ్చని చెప్పారు.
అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదని, వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు.ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వడదెబ్బ నివారణ చర్యలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ లలితా దేవి విజ్ఞప్తి చేశారు.
