Site icon Chaithanya Galam News

రసాయన రహిత వ్యవసాయంతో భూమి ఆరోగ్యం పదిలం

భూమి

భూమి

Spread the love

మితిమీరి వాడే ఎరువులతో క్షీణిస్తున్న భూసారం.

పర్యవేక్షణ లోపిస్తే పంట భూమి కలుషితం అయ్యే అవకాశం.

సాగు రసాయనాలతో భావితరాల భవిష్యత్తుకు పెను ప్రమాదం.

కెమికల్ ఫెర్టిలైజర్స్ కు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్న వ్యవసాయ శాఖ.

రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు ఊపందుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రావాల్సిన యూరియా సకాలంలో రాని కారణంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం యూరియా కోసం బారులు తీరుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఏ ఇద్దరు రైతులు కలిసినా యూరియా లభ్యత గురించే చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పంట భూములలో రసాయనిక ఎరువుల వాడకంపై అందరి దృష్టి మల్లుతుందని తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రసాయనిక ఎరువుల వినియోగంలో తీసుకు రావలసిన మార్పుల గురించి నీలగిరి ఎక్స్ప్రెస్ తో ముచ్చటించారు.

ఎరువుల వాడకంలో నియంత్రణ అవసరం:


✅ ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన 2021-22 నివేదిక ప్రకారం సౌత్ జోన్ లో తెలంగాణ తో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు మొదలగు రాష్ట్రాలు ఉండగా సగటున హెక్టారుకు వినియోగిస్తున్న ఎరువుల మోతాదులో తెలంగాణ రాష్ట్రం 283.4 కే.జి లతో మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 233.2 కేజీ లు, తమిళనాడు 190.1 కేజీ లతో రెండవ మరియు మూడవ స్థానాలను నిలిచాయి. కాగా ఇదే ఏడాది దేశంలోనే అన్ని రాష్ట్రాల సగటు ఎరువుల వినియోగం హెక్టారుకు కేవలం 146.7 కేజీలు ఉండగా తెలంగాణ రాష్ట్ర సగటు 283.4 కే.జి లు ఉండటంతో సమస్య తీవ్రత కంటికి అద్దం పట్టినట్లుగా కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, మరియు వ్యవసాయ శాఖ యంత్రాంగం వెంటనే అప్రమత్తమై క్షేత్రస్థాయిలో చేపట్టిన రైతు అవగాహన కార్యక్రమాల ఫలితంగా 2023-24 వ సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్ర సగటు ఎరువుల వినియోగాన్ని హెక్టారుకు 220 కేజీల కు తగ్గించడం లో అధికారులు సఫలం అయ్యారు. అయినప్పటికీ ఇది దేశ సగటు కన్నా గణనీయంగా అధికంగా ఉండటం గమనించాల్సిన విషయమే.

✅ మితిమీరిన రసాయన ఎరువుల వాడకం వల్ల నేల కాలుష్యంతో పాటుగా, యూట్రోఫికేషన్ ప్రక్రియ ద్వారా నీటి వనరుల సైతం కాలుష్యం చెందే ప్రమాదం పొంచి ఉంది.

✅ ఎరువుల వాడకం శృతి మించితే భవిష్యత్తులో సారవంతమైన భూములు సైతం నేల కాలుష్యం కారణంగా బీడు బారిపోయే ప్రమాదం పొంచి ఉంది.

పర్యావరణహితమైన ఎరువుల వినియోగం పెరగాలి


✅ సాధారణంగా ఎరువుల వినియోగ సామర్ధ్యం అనేది నేల రకాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు యూరియా విషయంలో వినియోగ సామర్థ్యం నేల రకాన్ని బట్టి కేవలం 20% నుండి 50% మాత్రమే ఉంటుంది. అంటే దాదాపు మనం పంటలకు వేస్తున్న యూరియాలో సగటున 50% నత్రజని వృధాగా మారి కాలుష్యానికి కారణమవుతుంది.

✅ ఈ వృధాను అరికట్టే దిశగా ప్రస్తుతం మార్కెట్లో ఫోర్టిఫైడ్, నానో టెక్నాలజీ, నీం కోటెడ్ యూరియా, వంటి నూతన శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందించిన ఎరువులను వివిధ కంపెనీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈయొక్క కొత్తతరం ఎరువుల వినియోగ సామర్థ్యం అధికంగా ఉండటంతో పాటు, పర్యావరణహితంగా ఉండటంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ వీటి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

✅ అలాగే పర్యావరణహితమైన జీవ ఎరువుల వినియోగం ప్రోత్సహించడం ద్వారా రైతులు రసాయన ఎరువుల మీద ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.

✅ వివిధ కంపెనీలు చేసే బ్రాండ్ మార్కెటింగ్ ప్రచారాల వల్ల కృత్రిమ ఎరువుల కొరత ఏర్పడకుండా చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2022 లో తీసుకొచ్చిన “వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్” పాలసీలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలు కూడా “భారత్ ఫెర్టిలైజర్” బ్రాండ్ తో ఎరువులు అమ్మాలని నిర్ణయించింది.

దేశంలో రసాయన ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాల వల్ల దేశంలో సగటు ఎరువుల వినియోగశాతం తగ్గడం శుభ పరిణామం. 2020-21 లో హెక్టారుకు 160.1 కేజీ గా ఉన్న దేశ సగటు ఎరువుల వినియోగం 2021-22 లో 146.7 కు తగ్గగా, 2023-24 నాటికి 139.81 కేజీ లకు తగ్గడం, అలాగే రాష్ట్రం లో ఎరువుల సగటు వినియోగం 2021-22 లో ఉన్న 283.4 కే.జి ల నుండి 2023-24 నాటికి 220 కేజీల కు తగ్గడం దేశంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రాజ్ కుమార్ బాదావత్
రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ఏఈఓ ల ఐక్య వేదిక.

Exit mobile version