Site icon Chaithanya Galam News

ఏసీబీ పట్టుకున్న తహసీల్దార్… రెండు రోజుల్లోనే మళ్లీ సీట్లో!

ఏసీబీ

ఏసీబీ

Spread the love

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది.

ఆమనగల్లు :
అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన అధికారి… రెండు రోజులు గడవకముందే మళ్లీ అదే సీట్లో కూర్చోవడం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో సంచలనం రేపింది. ప్రజల కళ్లముందే జరిగిన ఈ పరిణామం వ్యవస్థల బలహీనతను బట్టబయలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత మంగళవారం పట్టాదారు పాసుపుస్తకంలో జెండర్ సవరణ కోసం రైతు నుండి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవిలను ఏసీబీ పట్టుకున్న విషయం తెలిసిందే. సుమారు ఎనిమిది గంటలపాటు కార్యాలయంలో సోదాలు జరిపి ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు, ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ప్రకటన కూడా విడుదల చేశారు.

కానీ గురువారం లలిత మళ్లీ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమై సీట్లో కూర్చొని యధావిధిగా పనులు నిర్వహించడం ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహానికి దారితీసింది. “లంచం కేసులో పట్టుబడ్డ అధికారి ఇంత తేలికగా బయటికి వచ్చి విధుల్లో కూర్చోవడం ఎలా సాధ్యం?” అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. ఎమ్మార్వో తన సంతకం పెట్టి విడుదల చేసిన స్థానికత ధ్రువీకరణ పత్రం ఒకటి ఆన్లైన్‌లో బయటకు రావడం, అది మీడియా చేతికి చిక్కడం స్థానిక పాలనపై మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏసీబీ పట్టుకున్న అధికారులు, మండల స్థాయి కార్యాలయాల్లో జరుగుతున్న పత్రాల గోలమాల్ – రెండూ కలిపి ప్రజల్లో అనిశ్చితి పెంచుతున్నాయి.

ఆర్డీవో జగదీశ్వరరెడ్డి వివరణ ఇచ్చినా – “ఆమె వస్తువులు తీసుకురావడానికి మాత్రమే కార్యాలయానికి వచ్చింది” అని – వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా కనిపిస్తున్నాయి. తహసీల్దార్ సీట్లో కూర్చొని అధికారిక పనులు చేయడం చూసిన ప్రజలు ఆర్డీవో మాటలను విశ్వసించడం లేదు.

ఏసీబీ చర్యలు కేవలం కాగితాలకే పరిమితమా? అవినీతి చేసిన వారు రెండు రోజుల్లోనే తిరిగి కుర్చీలో కూర్చోవడమేలాగ? నిజంగా అవినీతి ఆగాలన్న సంకల్పం ప్రభుత్వ యంత్రాంగానికి ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆమనగల్లు ప్రజల ఆగ్రహ స్వరాలుగా వినిపిస్తున్నాయి.

Exit mobile version